Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి అసలు సిసలు పరీక్ష! ఇప్పుడే మొదలైందా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ ఒక్కసారిగా మారిపోయింది. పార్టీలో ప్రభుత్వంలో ఆయన నాయకత్వంపై ఇన్నాళ్లు సన్నాయి నొక్కులు నొక్కిన నేతలు అంతా ఇప్పుడు గప్ చుప్ అయిపోయారు.

By:  Tupaki Political Desk   |   17 Nov 2025 4:15 AM IST
రేవంత్ రెడ్డికి అసలు సిసలు పరీక్ష! ఇప్పుడే మొదలైందా?
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టార్ ఒక్కసారిగా మారిపోయింది. పార్టీలో ప్రభుత్వంలో ఆయన నాయకత్వంపై ఇన్నాళ్లు సన్నాయి నొక్కులు నొక్కిన నేతలు అంతా ఇప్పుడు గప్ చుప్ అయిపోయారు. పార్టీ అధిష్టానం సైతం రేవంత్ రెడ్డి నాయకత్వానికి పూర్తిగా తలగ్గొల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి ప్రభుత్వానికి ఇక తిరుగులేదా? అంటే ఔను అని మాత్రం చెప్పలేమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. జూబ్లీహిల్స్ విజయంతో అంతా సెట్ రైట్ అయినట్లు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తుతం ఎదుర్కొన్న రాజకీయ పరీక్షలో పాసైనట్లుగానే పరిగణించాలని సూచిస్తున్నారు. ఈ విజయం ఇచ్చిన స్ఫూర్తితో సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో ప్రభుత్వంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ముందున్న కాలమంతా ముల్లబాటేనని గుర్తెరిగి నడుచుకోవాలని చెబుతున్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురైన సవాళ్లను మరొసారి సమీక్షించుకుని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు.

ఇల్లు అలకగానే పండగ కాదన్నట్లు.. జూబ్లీహిల్స్ విజయంతో తెలంగాణ కాంగ్రెస్ సంబరాలు చేసుకోకూడదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇకపై జనాభిమానాన్ని చూరగొనేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుచుకోవాల్సివుంటుందని ఆయన సన్నిహితులు సూచిస్తున్నారు. ప్రధానంగా పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని, ఆ పనిని వీలైనంత తొందరగా ప్రారంభించాలని వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి అధికారాలనే ప్రశ్నించేలా నడుచుకోవడాన్ని ఇకపై ఉపేక్షించకూడదని సూచిస్తున్నారు.

రెండేళ్లుగా అందరికీ స్వేచ్ఛ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లో కొంత చులకన అయ్యారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. పార్టీలో తాను జూనియర్ అన్న భావనతో సీఎం కొందరు సీనియర్లకు అవసరానికి మించి గౌరవం ఇవ్వడం కూడా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని, ఇకపై ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే ఉండేలా అదుపు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇదే సమయంలో ప్రజల సమస్యలు, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశాలపై దృష్టి పెట్టాల్సివుందని అంటున్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులతోపాటు ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో లోటుపాట్లను సరిద్దాల్సిన ఉంటుందని అంటున్నారు. దీనికి ఉచిత బస్సు పథకాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన రెండో రోజే ఉచిత బస్సును తీసుకువచ్చినా మహిళా ఓటర్లను సంతృప్తి పరచలేకపోతున్నారనే విమర్శలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం కష్టనష్టాలను ఓర్చి పథకాన్ని అమలు చేస్తున్నా ఆర్టీసీ సిబ్బంది నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని చెబుతున్నారు. సరిగా బస్సులు నిలపకపోవడం, ప్రయాణికుల పట్ల మర్యాద లేకుండా వ్యవహరించడాన్ని సమీక్షించాలని సూచిస్తున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీపై ఇప్పటికీ ప్రజల నుంచి సానుకూలత సంపాదించలేకపోయారని, ఎక్కడో ఒక అసంతృప్తి ఉందని, అలాంటి చిన్న చిన్న అంశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని అంటున్నారు. ఏదిఏమైనా జూబ్లీహిల్స్ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక బాహుబలిగా మలిచినందున ఇకపై అత్యంత జాగ్రత్తగా నడుచుకోవాల్సివుంటుందని ఆయన సన్నిహితులు, మేలుకోరేవారు వ్యాఖ్యానిస్తున్నారు.