Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ టీడీపీ ఓటర్లు ఎవరికి జైకొడతారు?

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించడంతో సరికొత్త చర్చ మొదలైంది.

By:  Tupaki Political Desk   |   8 Oct 2025 10:13 AM IST
జూబ్లీహిల్స్ టీడీపీ ఓటర్లు ఎవరికి జైకొడతారు?
X

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించడంతో సరికొత్త చర్చ మొదలైంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. వచ్చేనెల 11న జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ తొలుత ఉత్సాహం ప్రదర్శించింది. అయితే కేడర్ సన్నద్ధంగా లేరన్న కారణంగా ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేవమయ్యారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పట్టుకోల్పోతూ వస్తున్న టీడీపీ.. మళ్లీ పుంజుకోవాలనే ఆలోచనపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తాజా నిర్ణయంతో స్పష్టమైందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఆ పార్టీ సానుభూతిపరుల ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేస్తాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే టీడీపీ సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేకపోవడం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోడానికి ఇతర పార్టీలు సాహసించలేని పరిస్థితులు ఉండటంతో ఒంటరి పోటీ సరైన నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఎటువైపు మళ్లుతాయనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు గత ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీ మద్దతుతో టీడీపీ గెలుచుకుంది. ఆ తర్వాత పరిణామాలతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా బలహీనపడగా, జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక 2018, 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే మాగంటి గోపీనాథ్ మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలవడానికి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు, కమ్మ సామాజికవర్గం మద్దతు కీలకంగా చెబుతున్నారు. టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే కమ్మ సామాజికవర్గం ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపే సంఖ్యలో ఉండటంతో వీరి ఓట్లు ఇప్పుడు నిర్ణయాత్మకశక్తిగా మారే అవకాశం ఉందంటున్నారు.

టీడీపీ పోటీ చేయకపోవడం, తమ అభిమాన నేత మాగంటి గోపీనాథ్ మరణంతో వారి ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాగంటి భార్య సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగడా పోటీ చేస్తుండటంతో సానుభూతితో ఆమెకు మద్దతుగా నిలుస్తారా? లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్న సానుకూలతతో అటువైపు మొగ్గుతారా? అన్న సందిగ్ధత నెలకొంది. ఏపీలో బీజేపీతో పొత్తు ఉండటం వల్ల చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థికి పార్టీ మద్దతు ప్రకటిస్తే అటు వైపు నిలిచే అవకాశం ఉందా? అన్న చర్చ జరుగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటిలానే టీడీపీ పోటీకి దూరంగా ఉండిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించని ఆ పార్టీ జెండాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవంలో రెపరెపలాడాయి. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ జెండాలతోపాటు టీడీపీ పతాకం రెపరెపలాడింది. దీంతో ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లు ఎటువైపు అన్న ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది.