Begin typing your search above and press return to search.

మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలు! ఇక్కడ నుంచే మలుపు తిరిగిన కథ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైటెన్షన్ గా మారింది. అధికార, ప్రతిపక్షాలు ఈ ఎన్నికను జీవన్మరణ సమస్యగా భావించడంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఫలితంపై కేంద్రీకృతమైంది.

By:  Tupaki Political Desk   |   10 Nov 2025 4:47 PM IST
మాగంటి గోపీనాథ్ మరణంపై అనుమానాలు! ఇక్కడ నుంచే మలుపు తిరిగిన కథ
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హైటెన్షన్ గా మారింది. అధికార, ప్రతిపక్షాలు ఈ ఎన్నికను జీవన్మరణ సమస్యగా భావించడంతో అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఫలితంపై కేంద్రీకృతమైంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. దాదాపు 5 నెలలుగా ఈ ఉప ఎన్నిక కోసం ఎదురుచూసిన ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే ప్రచారం చివరి దశకు చేరుకుందన్న సమయంలో ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి చేసిన ఫిర్యాదు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫిర్యాదు వెనుక రాజకీయంపై ఎక్కువ చర్చ జరుగుతోంది.

ఎన్నికకు రెండు రోజుల ముందు మాగంటి మరణంపై అనుమానాలు లేవనెత్తడం వల్ల ఈ అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యాంశంగా మారిపోయింది. ఐదు నెలల క్రితం ఎమ్మెల్యే మరణిస్తే, అప్పుడు రాని లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు అన్న ప్రశ్నకు బీజం వేసింది. సరిగ్గా ఎన్నికకు రెండు రోజుల ముందు జరిగిన ఈ పరిణామంతో పోలింగ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందా? లేదా? అనే చర్చకు తెరలేపింది. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ ముందు వరకు ఎవరికీ తెలియని, పెద్దగా అవగాహన లేని గోపీనాథ్ వ్యక్తిగత, కుటుంబ వివాదాలు ప్రచారంలో తెరపైకి రావడం కూడా కాకరేపుతోంది.

దీంతో జూబ్లీహిల్స్ రాజకీయం మలుపు తిరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గోపీనాథ్ మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేయనంత వరకు కేవలం ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమంపైనే విమర్శలు ప్రతివిమర్శలు ఉండేవి. ఈ విషయంలో రెండు పార్టీలు తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించడం వల్ల ఓటరు నాడి తెలుసుకోవడం చాలా కష్టమైందని అంటున్నారు. అయితే దివంగత నేత మరణంపై ఫిర్యాదు చేసిన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందని అంటున్నారు. ఈ విషయంలో ఓటర్లు కూడా రెండుగా చీలిపోయినట్లు విశ్లేషిస్తున్నారు. దివంగత నేత వ్యక్తిగత అంశాలను ప్రచారంలోకి తేవడం, వివాదం చేయడాన్ని కొందరు తప్పుపడుతుండగా, మాగంటి మరణం వెనుక మిస్టరీని మరికొందరు అనుమానిస్తున్నారు.

ఈ ఇష్యూ తెరపైకి రానంతవరకు గుంభనంగా వ్యవహరించిన ఓటర్లు.. ఇప్పుడు రెండుగా విడిపోయి చర్చిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఏ వర్గం మెజార్టీ ఎక్కువగా ఉందన్నది మాత్రం స్పష్టం కావడం లేదు. కానీ, మాగంటి మరణంపై ఫిర్యాదు చేసే వరకు పెదవి విప్పని ఓటర్లు.. ఆ తర్వాత ఉప ఎన్నిక తీరుపై చర్చించుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నిక ఫలితాన్ని ఈ అంశమే ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటున్నారు.