జూబ్లీహిల్స్... ‘ఎమ్మెల్యే’లు అసలు పోటీలోనే లేని ఉప ఎన్నిక!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది.
By: Tupaki Political Desk | 16 Oct 2025 1:00 PM ISTఎక్కడైనా ఉప ఎన్నిక జరిగితే గతంలో ఆ నియోజకవర్గం నుంచి గెలిచి, తర్వాత ఓడిన నాయకులు (మాజీ ఎమ్మెల్యేలు) పోటీలో ఉంటారు. సిటింగ్ ఎమ్మెల్యేలు రాజకీయ లక్ష్యాలు, కారణాలతో రాజీనామా చేసి బరిలో దిగితే నేరుగా ఎమ్మెల్యేనే మళ్లీ పోటీలో ఉన్నట్లు అవుతుంది. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్సీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్-నేటి బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ఇలానే పోటీకి నిలిచారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ పరిస్థితి లేకపోవడం గమనార్హం. దీనికి పలు కారణాలు ఉన్నాయి.
ఎవరు గెలిచినా తొలిసారే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. తొలుత సిటింగ్ స్థానంలో బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను నిలిపింది. తర్వాత అధికార కాంగ్రెస్ నుంచి యువ నాయకుడు నవీన్ యాదవ్ కు టికెట్ దక్కింది. దీంతో ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లు అయింది. బలాబలాల రీత్యా.. దీటైన స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల వారు ఎవరూ బరిలో లేనందున ఈ ముగ్గురిలో గెలుపు ఒకరిదే అని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరు గెలిచినా తొలిసారే కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా ఒక ప్రధాన అభ్యర్థికి ఇవి తొలి ఎన్నికలు కావడం గమనించదగ్గ విషయం.
భర్త అడుగుజాడల్లో..
హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా పేరున్న మాగంటి గోపీనాథ్ అనూహ్య మరణంతో ఆయన భార్య సునీతకు రాజకీయ ప్రవేశం తప్పలేదు. మొన్నటివరకు కుటుంబ బాధ్యతలకే పరిమితమైన సునీత ఇప్పుడు తన భర్త ఆశయ సాధనకు నడుంబిగించారు. రాజకీయాలను భర్త చాటు నుంచి పర్యవేక్షించిన ఆమె తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు.
మూడోసారి లక్ పరీక్ష
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో వరుసగా రెండుసార్లు (2014, 2018) జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గణనీయ సంఖ్యలో ఓట్లు కూడా తెచ్చుకున్నారు. గెలుపు మాత్రం దక్కలేదు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ లో చేరినా, ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండడం ఇప్పుడు పనికి వచ్చింది. ఆయన మూడో ప్రయత్నలో కచ్చితంగా గెలిచి ఎమ్మెల్యే కావాలన్న చిరకాల కోరికను నెరవేర్చుకునే పట్టుదలతో ఉన్నారు.
వరుసగా రెండోసారి...
బీజేపీ అభ్యర్థి, ఆ పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న లంకల దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి 2023లో పోటీచేశారు. ఉప ఎన్నికలోనూ టికెట్ పొందారు. దీంతో ఆయన మిగతా ఇద్దరు అభ్యర్థుల కంటే.. వరుసగా రెండోసారి బరిలో నిలిచినట్లు అయింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ ఎన్నికలను ఎదుర్కొనే లక్ష్యంతో ఉన్నారు.
-కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ నుంచి 2009-14 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ వచ్చి ఉంటే.. ఒక మాజీ ఎమ్మెల్యే అయినా ఉప ఎన్నిక పోటీలో ఉన్నట్లయ్యేది.
-కాంగ్రెస్ తరఫున 2023లో పోటీచేసిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ 2009లో యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా పనిచేశారు. ఒకవేళ మళ్లీ ఆయనకే టికెట్ దక్కినా.. చట్టసభ మాజీ సభ్యుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో ఉన్నట్లు అయ్యేది.
