Begin typing your search above and press return to search.

కేటీఆర్ నాయకత్వానికి పెను సవాల్.. ఆ పదవికి ముందు ఈ గండం గట్టెక్కాలి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. పదేళ్లుగా ఇక్కడ కారు పార్టీకి ఎదురులేకుండా ఉంది.

By:  Tupaki Political Desk   |   30 Oct 2025 2:00 PM IST
కేటీఆర్ నాయకత్వానికి పెను సవాల్.. ఆ పదవికి ముందు ఈ గండం గట్టెక్కాలి
X

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వానికి అగ్నిపరీక్షగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. సీనియర్ నేత హరీశ్ రావు తండ్రి మరణించడంతో ఆయన అనూహ్యంగా ప్రచారానికి దూరమయ్యారు. దీంతో పార్టీ గెలుపు బాధ్యత మొత్తం కేటీఆర్ పై పడింది. పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ.. గత రెండేళ్లుగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు అధికారపార్టీ అన్నివిధాలుగా పైచేయి సాధించడానికి ప్రయత్నించడం, మరోవైపు నుంచి తమ స్థానాన్ని లాక్కోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో జూబ్లీహిల్స్ స్థానాన్ని నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంటుగా కేటీఆర్ కు అత్యంత ప్రధానమంటున్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం. పదేళ్లుగా ఇక్కడ కారు పార్టీకి ఎదురులేకుండా ఉంది. ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నికలో మళ్లీ గెలవడం బీఆర్ఎస్ కు అత్యావసరం అంటున్నారు. ఈ స్థానంలో గెలవడం వల్ల పార్టీకి ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ లేకపోయినా, రిజల్ట్ తేడా వస్తే జరిగే నష్టం మాత్రం చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అధినేత కేసీఆర్ గైర్హాజరు, సీనియర్ నేత హరీశ్ రావు రాలేని పరిస్థితుల్లో ఫలితం ఎలా ఉన్నా, దానికి కేటీఆర్ బాధ్యత వహించాల్సివున్నందున జూబ్లీహిల్స్ గెలిపించడం ఆయన భవిష్యత్తుకు కీలకంగా చెబుతున్నారు.

పార్టీలో నెంబర్ టు గా ఉన్న కేటీఆర్.. కొద్దిరోజుల్లోనే నెంబరు వన్ స్థానాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ స్థానం కోసం పోటీపడిన చెల్లి కవిత.. ఆ స్థానం దక్కదనే ఆలోచనతో ఇప్పటికే తప్పుకున్నారు. ఇక కేటీఆర్ కు పోటీగా భావిస్తున్న ఇతర నేతలు కూడా ప్రస్తుతం సైలెంటుగానే ఉన్నారు. మరోవైపు తండ్రి, బీఆర్ఎస్ అధినేత సైతం కేటీఆర్ కు పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారం కోల్పోవడంతో అధ్యక్ష పదవిని కేటీఆర్ కు అప్పగించడానికి కేసీఆర్ వెనక్కి తగ్గారని అంటున్నారు. ప్రతిపక్షంలో బాధ్యతలు బదిలీ చేయడం తగిన సమయం కాదన్న ఆలోచనతోనే అధినేత కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారని చెబుతున్నారు.

ఇదే సమయంలో పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన నుంచి మొత్తం బాధ్యతలు కేటీఆర్ కే అప్పగించారు. గత రెండేళ్లుగా పార్టీ కార్యక్రమాలు అన్ని కేటీఆర్ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కేసీఆర్ ఎక్కడా కనిపించడం లేదు. ఎర్రవెల్లి ఫాం హౌస్ కే పరిమితమైన అధినేత అప్పుడప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఫలితం ఎలా ఉన్నా అందుకు కారణం కేటీఆర్ అవుతారని అంటున్నారు. ప్రస్తుతం ప్రచారం మొత్తం తన భుజస్కందాలపై వేసుకున్న కేటీఆర్.. అధికార పార్టీ కాంగ్రెస్ కు దీటుగా దూసుకుపోతున్నారు.

అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ తన్నుకుపోవాలని అధికార కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాన్ని వేడిక్కిస్తున్నాయి. సీఎం రేవంత్ తోపాటు మంత్రులు మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొహరించి, క్షేత్రస్థాయిలో పనిచేయాలని నిర్ణయించడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఒత్తిడికి గురిచేస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి, పార్టీ అభ్యర్థి సునీతను గెలపించడం కేటీఆర్ కు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో నెగ్గుకురావడం అంటే చిన్నవిషయమే కాదన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు రకరకాల సానుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆ రెండు పార్టీలకు అధికారం అనే బలం అదనపు అడ్వాంటేజ్ గా మారింది. కానీ, బీఆర్ఎస్ పార్టీ అన్నిరకాలుగా ఎదురీదాల్సివస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీని గెలిపించి తన భవిష్యత్తును కేటీఆర్ ఎలా తీర్చిదిద్దుకుంటారో చూడాల్సివుందని అంటున్నారు.