జూబ్లీహిల్స్ బైపోల్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండింట్లో మైనార్టీల చాయిస్ ఏది?
జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం నాలుగు లక్షల ఓట్లకు గాను దాదాపు 1.40 లక్షల ఓట్లు మైనార్టీలు ఉన్నారు. షేక్‌పేట్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, రెహమత్‌నగర్ వంటి డివిజన్లలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది.
By: Tupaki Political Desk | 11 Oct 2025 11:00 PM ISTజూబ్లీహిల్స్ బైపోల్స్ తెలంగాణలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన రెండేళ్లకు జరుగుతున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి రెఫరెండంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. గత సంప్రదాయం ప్రకారం ఉప ఎన్నికలలో సిటింగ్ పార్టీకి అవకాశం వదిలేసేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్ధతికి స్వస్తి పలికారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సుమారు 4 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 30 శాతం ఓట్లతో మైనార్టీలు నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఈ వర్గం ఓటర్లు ఎటు మొగ్గితే విజయం ఆ పార్టీని వరించే అవకాశం ఉందని అంటున్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం నాలుగు లక్షల ఓట్లకు గాను దాదాపు 1.40 లక్షల ఓట్లు మైనార్టీలు ఉన్నారు. షేక్‌పేట్, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, బోరబండ, రెహమత్‌నగర్ వంటి డివిజన్లలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్లే విజేతను నిర్ణయించినట్లు గత ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పట్లో ప్రతిపక్షం టీడీపీ మైనార్టీ నేతకు అవకాశం ఇచ్చినా, మాజీ మంత్రి పీజేఆర్ మరణంతో ఏర్పడిన సానుభూతితో ఆయన కుమారుడు విష్ణవర్థన్ రెడ్డి విజేతగా నిలిచారు.
ఇక 2014లో ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది. అప్పట్లో బీజేపీతో పొత్తుతో టీడీపీ పోటీచేసింది. అయితే మైనార్టీ ఓట్లు కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చీలిపోవడంతో టీడీపీ గెలిచినట్లు విశ్లేషిస్తున్నారు. 2018లో ఎంఐఎం పోటీ చేయకపోవడం, ముస్లిం ఓట్లు అన్నీ గంపగుత్తగా పడటంతో బీఆర్ఎస్ ఘన విజయం సాధించినట్లు చెబుతున్నారు. 2023లో కూడా ఎంఐఎం పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ మైనార్టీ నేతను బరిలోకి దింపింది. అయితే మైనార్టీలు బీఆర్ఎస్ కే జైకొట్టినట్లు అప్పటి పరిస్థితులను బట్టి విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ మైనార్టీ నేతను ప్రయోగించడం వల్ల ఓట్లు పెంచుకోగలిగింది కానీ, విజయం సాధించలేకపోయిందని అంటున్నారు.
ఇక తాజా ఎన్నికల్లో మైనార్టీల మద్దతు కీలకంగా చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య స్నేహం ఉండటం వల్ల మైనార్టీ ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని అంటున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఎంఐఎం ఆ పార్టీకి దూరంగా ఉంటోంది. అలాగని కాంగ్రెస్ తోనూ పెద్ద సఖ్యత చూపడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మైనార్టీలు ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఒక సారి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున తలపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి సునీతకు అవకాశం ఇచ్చింది.
మైనార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీలిపోతారా? లేక ఏకంగా ఒకే పార్టీకి జైకొడతారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇదే సమయంలో ఎంఐఎం పోటీ చేసే అవకాశాలుపైనా చర్చ జరుగుతోంది. ఒక వేళ ఎంఐఎం పోటీ చేస్తే భారీగా ఓట్లు చీలిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. అప్పుడు ఏ పార్టీకి నష్టం జరుగుతుందనే ప్రశ్నపై హాట్ డిబేట్ జరుగుతోంది. మైనార్టీలు గతంలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలవడంతో ఆ పార్టీ ఓటింగుకు కోత పడుతుందా? లేక కాంగ్రెస్ పై మొగ్గుచూపే వర్గం ఎంఐఎం వైపు మళ్లుతుందా? అనేది ఉత్కంఠ పుట్టిస్తోంది. ఏదిఏమైనా మైనార్టీల మద్దతు కైవసం చేసుకున్నవారే అంతిమ విజేతలు అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
