Begin typing your search above and press return to search.

కేసీఅర్ ని పిలుస్తున్న జూబ్లీ హిల్స్

బీఆర్ఎస్ సీటుని కోరి మరీ కాంగ్రెస్ కి అప్పగించడం అంటే రాజకీయంగా అది ఆత్మహత్యా సదృశ్యమే.

By:  Satya P   |   16 Oct 2025 8:30 AM IST
కేసీఅర్ ని పిలుస్తున్న జూబ్లీ హిల్స్
X

ఇజ్జత్ మే సవాల్ అన్న మాట ఎక్కువగా రాజకీయాల్లోనే వినిపిస్తుంది. కొన్ని సార్లు ఎన్నికలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా ఉప ఎన్నికలు చూస్తే టగ్ ఆ వార్ గానే సాగుతాయి. ఉప ఎన్నికలు చాలా చిన్నగానే చూడాలి. వాటి వల్ల ప్రభుత్వాలు కూలవు, అధికారాలు తారు మారు కావు, అయినా సరే ఉప ఎన్నికలు తాడో పేడో తేల్చుకునేలా కొన్ని కీలక సందర్భాలలో అనిపిస్తాయి. ఇపుడు అలాంటిదే తెలంగాణా రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికగా చెబుతున్నారు.

రీజన్స్ అన్నీ ఇవే :

ఎందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది అన్నది ఒక చర్చ. ఇది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం తరువాత అనివార్యమైన పరిస్థితులలో జరుగుతున్న సాధారణమైన ఎన్నికగానే చూడాలి. కానీ తెలంగాణా రాజకీయాల నేపధ్యం నుంచి చూస్తే మాత్రం అసలు అలా అనుకోవడానికే లేదు అని అంటున్నారు. ఈ సీటు బీఆర్ఎస్ ది. మరణించిన ఎమ్మెల్యె మాగంటి గోపీనాధ్ బీఆర్ఎస్ జెండా మీద రెండు సార్లు గెలిచారు. దాంతో గులాబీ పార్టీకి ఈ ఎన్నిక చాలా కీలకంగా మారింది. అంతే కాదు రేవంత్ రెడ్డి సీఎం గా అయి దాదాపుగా రెండేళ్ళకు దగ్గర అవుతోంది. ఏ ప్రభుత్వం అయినా పనితీరుని జనాలు అంచనాకు రావడానికి ఈ సమయం సరిగ్గా సరిపోతుంది. మరి జనాల నాడి ఎలా ఉంది అన్నది తెలిసేది ఎలా ఉంటే అడపా దడపా వచ్చే ఉప ఎన్నికల వల్లనే. అందుకే ఉప ఎన్నికలను బీఆర్ఎస్ గట్టిగానే తీసుకుంటోంది అని అంటున్నారు.

అస్తిత్వమే సమస్యగా :

బీఆర్ఎస్ సీటుని కోరి మరీ కాంగ్రెస్ కి అప్పగించడం అంటే రాజకీయంగా అది ఆత్మహత్యా సదృశ్యమే. రేపటి ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెప్పుకుంటున్న బీఆర్ఎస్ లాంటి పార్టీకి ఇది అసలు ఏ మాత్రం కుదిరే వ్యవహారం కాదు. అందుకే అన్ని లెక్కలూ సరిచూసుకుంటూ బస్తీ మే సవాల్ అంటోంది. మరణించిన గోపీనాధ్ సతీమణినే బరిలోకి దింపింది బీఆర్ఎస్. ఈ విధంగా సానుభూతి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. అంతే కాదు మహిళా అభ్యర్థి కావడం కూడా ఒక అడ్వాంటేజ్ గా చూస్తోంది.

అర్బన్ ఓటర్లే అండ :

బీఆర్ఎస్ కి మొదటి నుంచి అర్బన్ ఓటర్లలో మంచి అభిమానం ఉంది. 2023 ఎన్నికల్లో కూడా పార్టీ ఓడినా ఎక్కువ సీట్లు గెలుచుకున్నది జంట నగరాల పరిధిలోని అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో అన్నది కూడా అంతా గుర్తు చేస్తున్నారు. అలా తమ పట్టుని నిలుపుకున్న బీఆర్ ఎస్ కి ఇపుడు అదే అర్బన్ ఏరియాలో ఉన్న తమ సీటుని కాపాడుకోవడం ఒక పెను సవాల్ అనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది. అలాగే జాతీయ స్థాయిలో అధికారంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీలను ఢీ కొట్టి విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఈ దెబ్బతో తమ సత్తాను చాటాలని చూస్తోంది అంటున్నారు.

కేసీఆర్ రెడీనా :

నిజానికి చూస్తే కేసీఆర్ ఈ ఉప ఎన్నికల ప్రచారానికి రారు అని మొదట్లో వినిపించింది. కానీ బీ ఫారం బిఆర్ఎస్ అభ్యర్ధినికి ఇస్తున్న వేళ ఆమె ఆయనను తన ప్రచారానికి రావాలని కోరినట్లుగా చెబుతున్నారు. దానికి పెద్దాయన కూడా సరేనని అన్నారని అంటున్నారు. నిజానికి చూస్తే బీఆర్ఎస్ కి మంచి పట్టు ఉంది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ లో లుకలుకలు ఉన్నాయి, బీజేపీ అభ్యర్థి విషయంలో కూడా ఆలోచనలు ఉన్నాయి. దాంతో ఈ కీలక సమయంలో కేసీఆర్ ఒక్కసారి కనుక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలోకి దిగి తన బలమైన వాణిని వినిపిస్తే కనుక మొత్తం సీన్ అంతా మారుతుదని బీఆర్ఎస్ కి అది పూర్తి స్థాయిలో ఉపకరిస్తుందని అంటున్నారు. అయితే కేసీఆర్ ఒక ఉప ఎన్నిక కోసం వస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే ఏమో ఆయన వస్తే మాత్రం గులాబీ జెండా ఎగిరేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.