జూబ్లీ ఎలక్షన్: ఎటు చూసినా 'ఈసీ కన్ను'.. కిం కర్తవ్యం?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు మంగళవారమే ముహూర్తం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
By: Garuda Media | 10 Nov 2025 3:24 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్‌కు మంగళవారమే ముహూర్తం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అప్పటి వరకు ఒకవేళ లైన్‌లో ఉంటే.. సమయం మీరినా.. ఓటేసేందుకు అనుమతి ఇస్తారు. ఇక, ఎన్నికలు కీలకం కావడం.. పోటీలో కీలక పార్టీలు ఉన్న నేపథ్యం, అదే సమయంలో వివాదాస్పద ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఎన్నికల సంఘం డేగకన్ను సారించింది. పోలీసులు, ఎన్నికల అధికారులకు విస్తృత అధికారులు ఇచ్చింది.
దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో పోలీసులు, ఎన్నికల అధికారులు తప్ప.. పెద్దగా జనసంచారం కానీ.. నాయకులు, పార్టీల నేతల సందడి కానీ.. కనిపించడం లేదు. కానీ, వాస్తవానికి ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు సహజంగానే పార్టీల నాయకులు సందడి చేస్తారు. ఓటరు స్లిప్పులు పట్టుకుని ఇంటింటికీ తిరుగుతారు. ఈ క్రమంలో కొద్ది మంది అనుచరులను కూడా వెంటేసుకుని వెళ్తారు. కానీ, ఈ దఫా దీనిపై కూడా నియంత్రణ విధించారు. ఇద్దరు ముగ్గురుకు మించి.. తిరిగేందుకు వీల్లేదని చెప్పారు.
దీంతో నాయకులు స్తబ్దుగా ఉన్నారు. ఇదే సమయంలో ఓటర్లను సహజంగానే ఒకరోజు ముందు మచ్చిక చేసుకునే 'ఇతర కార్యక్రమాలు' కూడా పెద్దగా సాగడం లేదు. 1600 మంది పోలీసులు.. ఇంతే సంఖ్యలో ఎన్నికల సంఘం సిబ్బంది.. అధికారులు తిరుగుతున్నారు. దీంతో నాయకులు ఏ చిన్న 'తప్పు' చేసినా వెంటనే దొరికి పోతారు. అంతేకాదు.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రేపటి గురించి ఈరోజు జరగాల్సిన ప్రధాన ఘట్టాలకు ఇంకా ఎవరూ సాహసించడం లేదన్న చర్చ సాగుతోంది.
మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేసిన వారు గత రాత్రే ఎవరి ప్రాంతాలకు వారు వెళ్లిపోయారు. ఏదైనా తేడా వస్తే.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంకోవైపు.. ప్రముఖ కవి.. ఉద్యమ నేత అందెశ్రీ అస్తమయంతో నాయకులు ఆయన నివాళిలో ఉన్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక రోజు ముందు.. ఇంత స్తబ్దత ఏర్పడడం గమనార్హం.
