రేవంత్ టీంలో ఐదుగురు మంత్రులకు మూడిందా?
తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం సీఎం రేవంత్ ను మరింత బలవంతుడిగా మారుస్తుందా? బలహీనుడ్ని చేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది.
By: Garuda Media | 1 Nov 2025 11:00 AM ISTపార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ నెమ్మదిగా పట్టు పెంచుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన ముద్రను చాటేందుకు తగిన సమయం కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే ఇందులో నిజముందన్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో మంత్రుల మీద పట్టు పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్.. కట్టుదాటిన మంత్రులను కాబినెట్ భేటీలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఈపరిస్థితుల్ని వెంటనే మార్చుకోవాలని చెప్పటం తెలిసిందే.
అదే సమయంలో పలువురు మంత్రుల పని తీరు ఏ మాత్రం బాగోలేదన్న ఫీడ్ బ్యాక్ అందుతున్న నేపథ్యంలో.. మంత్రివర్గ ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నప్పటికి.. అందుకు తగిన వాతావరణం కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండేళ్లు అవుతున్న వేళ.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేని పరిస్థితి.
తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం సీఎం రేవంత్ ను మరింత బలవంతుడిగా మారుస్తుందా? బలహీనుడ్ని చేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం.. మంత్రివర్గంలో ఉన్న మంత్రులు యాక్టివ్ గా లేకపోవటమే. అలాంటి వారిని దారికి తీసుకొచ్చేందుకు.. మిగిలిన వారికి భయం భక్తిని పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు.
దీనికి తోడు.. మంత్రివర్గంలోని తీసుకోవాల్సిన అంశం నెలల తరబడి పెండింగ్ లో ఉంది. ఈ విషయంలోనూ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వారిని చేర్చుకోవటం.. పని చేయని వారిని వదిలించుకోవటం అన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. దీనికి సంబంధించి కొన్ని పేర్లను జాబితాగా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్ని అధిష్ఠానంతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ చర్చించినట్లుగా తెలుస్తోంది.
వీరి వాదనతో అధిష్ఠానం ఏకీభవించినట్లుగా తెలుస్తోంది. పార్టీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం సానుకూలంగా వస్తే.. ఆ వెంటనే కాబినెట్ పునర్ వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడతాయని చెబుతున్నారు. దాదాపు ఐదుగురు మంత్రులు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. కొత్తగా మంత్రి పదవులు పొందిన వారిని మినహాయించి.. పాత వారిపైవేటు పడుతుందని చెబుతున్నారు. మొత్తంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సానుకూల ఫలితం ఏర్పడితే.. అనంతరం ప్రభుత్వంలో చాలానే మార్పులు చూస్తారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
