జూబ్లీహిల్స్ లెక్కలు, తీసివేతలు.. ఈ రాత్రి హైఅలర్ట్!
జూబ్లీహిల్స్ లో ఐదు నెలలుగా నెలకొన్న పొలిటికల్ హీట్ కు తెరపడబోతోంది. మంగళవారం పోలింగు జరుగుతుండగా, 14న ఫలితాలు విడుదల కానున్నాయి.
By: Tupaki Political Desk | 10 Nov 2025 6:00 PM ISTజూబ్లీహిల్స్ లో ఐదు నెలలుగా నెలకొన్న పొలిటికల్ హీట్ కు తెరపడబోతోంది. మంగళవారం పోలింగు జరుగుతుండగా, 14న ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపునకు సమయం ఉన్నా, నేతల వీధి యుద్ధానికి ఎండ్ కార్డు పడటంతో ప్రస్తుతం వీధులన్నీ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి జరగబోయే పరిణామాలే అత్యంత కీలకంగా చెబుతున్నారు. గడిచిన 5 నెలలుగా ఎత్తులు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో రచ్చ రేపిన రాజకీయంలో ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరి వ్యూహం వర్క్ అవుట్ అయిందనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత జూబ్లీహిల్స్ రాజకీయాలపై అన్ని పార్టీ ఫోకస్ చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకు అనూహ్యంగా వచ్చిన ఈ ఎన్నిక అధికార, ప్రతిపక్షాలకు విషమ పరీక్షగా మారింది. గెలవాల్సిన అనివార్యత వల్ల ఉభయ పక్షాలు శక్తికి మించిపోరాడాయి. కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు ఇచ్చే తీర్పును రాష్ట్ర ప్రజల మనోగతానికి ప్రతిబింబంగా భావించడం వల్ల ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత పోటీ చేస్తున్నా, ప్రధాన పోటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యే అన్నట్లు ప్రచారం సాగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంటు కేటీఆర్ వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ‘జూబ్లీహిల్స్’ విజేత ఎవరు అవుతారనేది తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ భవిష్యత్తును జూబ్లీహిల్స్ తీర్పు నిర్ణయించనుందనే విశ్లేషణలతో ప్రతి చిన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఇక వారం రోజులకు పైగా హోరాహోరీ సాగిన ప్రచారంలో ఉభయ పార్టీలు తగ్గేదేలే అన్నట్లు కనిపించాయి. అధికార, ప్రతిపక్షాలు ఎక్కడా తగ్గకపోవడంతో ఓటరు తీర్పు ఎలా ఉండబోతుందనేది సస్పెన్స్ గా మారింది.
ప్రచార హోరు తర్వాత ఈ రోజు సైలెంటుగా జరిగే ప్రలోభాలు విజేతను నిర్ణయిస్తారని అంటున్నారు. ఈసీ నిఘాతో ప్రస్తుతం వీధులన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నా, రాత్రికి మందు, విందు రాజకీయం నడపటంలో ఎవరిది పైచేయి అవుతుందనేదే ఆసక్తి రేపుతోంది. అదే సమయంలో కానుకలు పంపిణీకి రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని అంటున్నారు. బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు దీటుగా పనిచేస్తున్నా, ఆ రెండు పార్టీలు చూపిస్తున్న జోరు కొన్ని విషయాల్లో బీజేపీ చూపలేకపోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఇక బహిరంగ ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టిన ప్రధాన పార్టీలు ఇప్పుడు కులాలు, వర్గాలు, కాలనీలు, అపార్ట్మెంట్లు వారీగా లెక్కలు, తీసివేతలతో బిజీగా కనిపిస్తున్నాయి. ఓటరు లిస్టు చేతిలో పెట్టుకుని ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి. అందులో కీలకమైన వారు ఎవరు.. ఎవరిని ప్రసన్నం చేసుకుంటే ఓట్లు వచ్చే వీలుంది అన్న లెక్కలతో గల్లీ లీడర్లు సైలెంటుగా పనికానిచ్చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు కొందరు అపార్లమెంటు సంఘాలను సంపద్రిస్తూ వారికి నజరానాలను అందిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇంతవరకు గ్రూపులుగా తిరిగిన నేతలు ఇప్పుడు సైలెంటుగా ఒక్కొక్కరు వెళుతూ తమకు అప్పగించిన టాస్క్ పూర్తి చేస్తున్నారని అంటున్నారు. ఇక చీకటి పడిన తర్వాత మరింత జోరుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికార, ప్రతిపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. దీంతో ఈ రాత్రి జరగబోయే పరిణామాలే పోలింగ్ సరళిని ప్రతిబింబించొచ్చని అంటున్నారు.
