చిన్నోడైనా పెద్ద మాట: న'విన్' యాదవ్ భేష్
అయితే.. ఎన్నికల సమయంలో మాత్రం తనను తప్పుడు వ్యక్తిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారని నవీన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
By: Garuda Media | 14 Nov 2025 6:10 PM ISTఉప ఎన్నిక హోరాహోరీ ఫైట్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. ఈ ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడారు. చిన్నోడే అయినా.. తొలిసారే విజయం దక్కించుకున్నా.. భేషైన మాట చెప్పారు. కార్య కర్తల్లో ఉత్సాహం ఇంకా తగ్గకముందే ఆయన.. అందరం కలిసి పనిచేద్దామని వ్యాఖ్యానించారు. ``ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు అందరం కలిసి రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం`` అని చెప్పారు. ఈ ఒక్కమాటతో జూబ్లీహిల్స్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఆయన చెప్పకనే చెప్పేశారు.
అయితే.. ఎన్నికల సమయంలో మాత్రం తనను తప్పుడు వ్యక్తిగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారని నవీన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. తన కుటుంబంపై కూడా ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు. అయినా.. నియోజకవర్గం ప్రజలు తనను ఆశీర్వదించారని తెలిపారు. ``బస్తీ చిన్నోడికి ఓటేయాలని ఇచ్చిన పిలుపుతో ప్రజలు తరలి వచ్చారు`` అని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఎవరైనా చేసింది చెప్పుకొంటారని.. కానీ, బీఆర్ ఎస్‌కు చేసింది చెప్పుకొనే పరిస్థితి లేక.. తనను టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేసిందన్నారు.
ప్రజలను, ఓటర్లను తాను బెదిరించినట్టు గా కూడా ప్రచారం చేశారని నవీన్ యాదవ్ చెప్పారు.కానీ, తాను ఎవరినీ బెదిరించలేద న్నారు. ఒకవేళ బెదిరిస్తే.. ఓట్లు వేసేవారు ఇప్పుడు ఉన్నారా? అని ప్రశ్నించారు. ప్రజలు తమ ఇష్టాను సారం ఓటేశారని.. వారి పిల్లోడిగా తనను ఆశీర్వదించి గుండెల్లో దాచుకున్నారని చెప్పారు. తనను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన అన్ని సూచనలు, సలహాలను అందరి నుంచి తీసుకుంటానని.. ఇక, ఇప్పుడు రాజకీయాలకు విమర్శలకు తావులేదన్న నవీన్.. అభివృద్ధి ఒక్కటే అందరి కర్తవ్యమని వ్యాఖ్యానించారు.
సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నాయకుల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనతో ఇన్నాళ్లు కలిసి అనేక మంది ప్రచారం చేశారని.... వారికి కూడా ధన్యవా దాలు చెబుతున్నానని అన్నారు. తన విజయం వెనుక కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు.
