"జూబ్లీహిల్స్‌లో 200 నామినేషన్లు వేస్తాం"
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో జిల్లాల వారీగా 200 మంది మాల సామాజికవర్గంలోని ఉప కులాలకు చెందిన యువతను.. రంగంలోకి దింపున్నట్టు వివరించారు.
By: Garuda Media | 14 Oct 2025 9:31 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా దుమారం రేపనుంది. తమను, తమ వర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో ఉన్న మాల సంఘం.. ఇక్కడ 200 మంది మాల ప్రతినిధులను పోటీకి నిలబెట్టనున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అనుసరి స్తున్న విధానాల కారణంగా మాల సామాజికవర్గంలోని ఇతర ఉపకులాలకు చెందిన చదువుకున్న యువతకు తీరని అన్యాయం జరుగుతోందని మాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇప్పటికే పలు మార్లు విజ్ఞప్తి చేశామని.. అయినా పట్టించుకోవడం లేదని జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, ప్రెసిడెంట్ చెరుకు రామ్ చందర్ అన్నారు.
ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో జిల్లాల వారీగా 200 మంది మాల సామాజికవర్గంలోని ఉప కులాలకు చెందిన యువతను.. రంగంలోకి దింపున్నట్టు వివరించారు. వారితో నామినేషన్లు వేయిస్తామని.. కాంగ్రెస్‌ను ఓడించేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హెచ్చరించడం గమనార్హం. రాష్ట్రంలో ఆరు నెలలుగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఎస్సీల్లోని 58 ఉప కులాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ‘ఎంపెరికల్ డేటా తీసుకుని, అన్ని వర్గాలతో చర్చించి వర్గీకరణ చేస్తామన్నారు. అవేవీ చేయకుండానే వర్గీకరణ చేసి 58 కులాల గొంతు కోశారు`` అని వారు దుయ్యబట్టారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు నాయకులు చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అయితే.. జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే పది మంది వరకు ఇండిపెండెంట్లు రెడీగా ఉన్నారు. వీరితోపాటు.. చిన్నచితకా పార్టీల నుంచి మరో ఏడెనిమిది మంది నామినేషన్లు వేయనున్నారు. తాజాగా నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో మరింత మంది తెరమీదకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో మాల సామాజిక వర్గం నాయకులు చేసిన వ్యాఖ్యలు ఈ ఉప పోరును మరింత వేడెక్కించేలా చేయడం గమనార్హం.
