జూబ్లీహిల్స్ పోరు: రంగంలోకి రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు ఉద్రుతంగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది.
By: Garuda Media | 27 Oct 2025 9:26 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు ఉద్రుతంగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కీలక నాయకులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, కేటీఆర్, హరీష్‌రావు వంటి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని మాజీ సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఏ విషయం ప్రస్తావించాలి? ఎక్కడ ఎలా ప్రజలను మచ్చిక చేసుకోవాలన్న విషయాలపై ఆయన స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ తరఫున మంత్రులు సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌లు ప్రచా రంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్నారు. కొందరు ఇంటింటికీ తిరుగుతూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వంతు కూడా వచ్చింది. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించనున్నారు. మంగళవారం నుంచి సీఎం స్వయంగా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఆ రోజు నిర్వహించే బహిరంగ సభ ద్వారా.. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి సీఎం స్వయంగా శ్రీకారం చుట్టనున్నారు.
ఆ తర్వాత.. ఈ నెల 30, 31వ తేదీల్లో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు షో నిర్వహిస్తారు. వచ్చే 4, 5వ తేదీల్లో మరో విడత రోడ్డు షో కూడా నిర్వహిస్తారు. ప్రధానంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. బీఆర్ ఎస్ పాలన, 20 నెలల తమ పాలనను ప్రజలకు వివరించనున్నారు. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. జూబ్లీహిల్స్‌లో ఏయే వర్గాలు ఎంతెంత మేలు చేస్తున్నాయన్న జాబితాను కూడా కాంగ్రెస్ రెడీ చేసుకుంది. దీని ప్రకారం జూబ్లీహిల్స్‌లోని 70 మంది పేదలకు మేలు జరుగుతోందని, దీనిని ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలుగా కరపత్రాలను ముద్రించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
