జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ దాదాపు ఖరారు
నవీన్ యాదవ్ పేరు ఖరారు కావడంతో జూబ్లీహిల్స్‌లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
By: A.N.Kumar | 26 Sept 2025 12:12 AM ISTతెలంగాణ రాజకీయాలలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి క్రమంగా పెరుగుతోంది. ఈ కీలక నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు దాదాపుగా తెరపడినట్లు తెలుస్తోంది. యువ నాయకుడు నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉపఎన్నిక అనివార్యం
ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గోపినాథ్ స్థానిక నాయకుడిగా బలమైన ముద్ర వేయడంతో, ఆయన సతీమణి మాగంటి సునీతను బీఆర్‌ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దింపింది.
ప్రధాన పోటీ బీఆర్‌ఎస్ - కాంగ్రెస్ మధ్యే
నవీన్ యాదవ్ పేరు ఖరారు కావడంతో జూబ్లీహిల్స్‌లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా సాగనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నవీన్ యాదవ్ బలాలు
స్థానికంగా యువ నాయకుడిగా నవీన్ యాదవ్ బలంగా ఉన్నారు. ఆయనకు బలమైన అనుచర వర్గం, ముఖ్యంగా మైనార్టీ, వెనుకబడిన వర్గాల మద్దతు లభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మారవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన అభ్యర్థిత్వం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీత బలం
మరోవైపు, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఆమె భర్త గోపినాథ్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, స్థానికులతో ఆయనకున్న అనుబంధం బలమైన పునాదిగా నిలవనున్నాయి. ఈ 'సెంటిమెంట్', 'అభివృద్ధి' అంశాలు బీఆర్‌ఎస్‌ను గెలుపు దిశగా నడిపించే అవకాశం ఉంది.
మొత్తంమీద ఈ ఉపఎన్నిక ఫలితం కేవలం జూబ్లీహిల్స్‌కే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపై కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరివైపు మొగ్గుతారనేది వేచి చూడాలి.
