Begin typing your search above and press return to search.

ఆడబిడ్డ కన్నీళ్లపై రచ్చ.. కాంగ్రెస్ నేతల మాటల మంటలు

భావోద్వేగ పరిణామాలకు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.

By:  Garuda Media   |   15 Oct 2025 5:22 PM IST
ఆడబిడ్డ కన్నీళ్లపై రచ్చ.. కాంగ్రెస్ నేతల మాటల మంటలు
X

భావోద్వేగ పరిణామాలకు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపపోరు వేళ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో చోటు చేసుకున్నపరిణామాలపై మంత్రుల స్పందన తొందరపాటు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మాటల మంటలు కాంగ్రెస్ పార్టీకి చేటు చేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో తన భర్త.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను తలుచుకొని ఆయన సతీమణి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కన్నీటిపై కాంగ్రెస్ మంత్రులు తుమ్మల.. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. అందుకు ప్రతిగా మాజీ మంత్రులు కేటీఆర్.. సబితా ఇంద్రారెడ్డి.. శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు జూబ్లీ ఉపపోరును మరింత రాజుకునేలా చేశాయని చెప్పాలి. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు వేళ కాంగ్రెస్ ఎలా వ్యవహరించాలన్న దానిపై కచ్ఛితమైన వ్యూహాన్ని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని ఎత్తి చూపాలని.. బీఆర్ఎస్ సెంటిమెంట్ ను నమ్ముకొని ఎన్నికలకు దిగుతోందని.. ఈ నేపథ్యంలో మాగంటి కుటుంబ సభ్యులపై విమర్శలకు దిగొద్దంటూ హితవు పలికారు. ఇదిలా ఉండగా సోమవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురైన మాగంటి సునీత కన్నీరు పెట్టుకున్నారు. ఆమె తీరుపై అనూహ్య రీతిలో రియాక్టు అయ్యారు తుమ్మల. బీఆర్ఎస్ నేతలు పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని.. మళ్లీ దోపిడీ చేసేందుకు కన్నీళ్లను కూడా వదిలిపెట్టట్లేదంటూ వ్యాఖ్యానించారు. కన్నీళ్లతో అధికారాన్ని మళ్లీ పొందే ప్రయత్నం చేస్తున్నట్లుగా విమర్శలకు దిగారు.

తుమ్మల వ్యాఖ్యలు ఇలా ఉంటే..మంత్రి పొన్నం మరో అడుగు ముందుకు వేశారు. సునీత అంటే తమకు సానుభూతి ఉందని.. అందరి ముందూ ఆమె మైక్ పట్టుకొని ఏడవడం విడ్డూరంగా ఉందని.. పదేళ్లలో ప్రజల సమస్యలను పరిష్కరించని బీఆర్ఎస్ వాళ్లు.. ఈ రోజున మహిళను ఏడిపిస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎమ్మెల్యే మరణిస్తే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలు అభ్యర్థిని పెట్టేవి కావని.. ఆ సంప్రదాయాన్ని తుంగలోకి తొక్కిందే బీఆర్ఎస్ పార్టీగా మండిపడ్డారు.

మాగంటి సునీత కన్నీళ్లపై కాంగ్రెస్ మంత్రులు తుమ్మల.. పొన్నం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడుతూ.. మాగంటి సునీత భావోద్వేగంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు నీతిమాలిన మనుషులుగా పేర్కొంటూ కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సునీత భావోద్వేగానికి గురైతే.. దానిపై కాంగ్రెస్ నేతలు అవాకులు.. చవాకులు పేలటం దారుణమన్న ఆయన.. కుటుంబ పెద్దనుకోల్పోయిన బాధ.. ఆవేదన మాగంటి సునీతకు ఉండదా? అని ప్రశ్నించారు.అంతేకాదు మాగంటి కుమార్తెపై అక్రమ ఎన్నికల కేసు పెట్టటాన్ని ప్రశ్నించారు.

మహిళ దు:ఖంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులను యావత్ మహిళా లోకం క్షమించదంటూ పోస్టు పెట్టిన సబిత ఒకలా రియాక్టు అయితే.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఉదంతంలో ‘కులాన్ని’ తెర మీదకు తీసుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గం మద్దతుతో మంత్రి పదవిని పొందిన తుమ్మల.. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ దు:ఖంలో ఉంటే అవమానిస్తారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల స్పందనతో కాంగ్రెస్ నేతలు రియాక్టు అవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే పోటీ పెట్టకుండా ఏకగ్రీవం చేసే సంప్రదాయానికి తూట్లు పొడిచిందే కేసీఆర్ అని.. అధికారంలో ఉన్నప్పుడు లేని సెంటిమెంట్లు.. కేటీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా? అని ప్రశ్నించారు.

పీజేఆర్ మరణించిన వేళ జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు విష్ణు పోటీ చేస్తే.. ఆ వేళ బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ అభ్యర్థిని పెట్టారని.. ప్రస్తుతం కేటీఆర్ పక్కన తిరుగుతున్న విష్ణుకు ఆ సోయి లేదన్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి.. పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించినప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మంత్రుల మాటల డ్యామేజ్ ను కొంతమేర తగ్గించినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న జూబ్లీఉప పోరు వేళ.. అధికారపక్ష నేతలు కాస్త ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యానించాలే తప్పించి.. తొందరపాటుతో వ్యవహరిస్తే డ్యామేజ్ తప్పదన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఏ మేర గుర్తిస్తారో చూడాలి.