ఆటో డ్రైవర్ల ర్యాలీనే దెబ్బకొట్టిందా? మహిళల ఓట్లు అందుకే పడలేదా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందు పార్టీకి సానుకూల వాతావరణం ఉండేదని అంటున్నారు.
By: Tupaki Political Desk | 17 Nov 2025 10:00 PM ISTజూబ్లీహిల్స్ ఎన్నికల్లో సిటింగ్ సీటును కోల్పోవడంపై బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం జరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన స్థానాన్ని సానుభూతితో కూడా కాపాడుకోలేకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓటమికి అసలు కారణాలు ఏంటి? అని ఆరా తీస్తున్న బీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో డ్రైవర్ల ర్యాలీ కూడా ఓటమికి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ ర్యాలీ మహిళా ఓటర్లను దూరం చేసిందని, బీఆర్ఎస్ గెలిస్తే మహిళలు ఉచిత బస్సు వద్దనే సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందని భావించారని అంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందు పార్టీకి సానుకూల వాతావరణం ఉండేదని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో వచ్చిన సానుభూతితోపాటు పార్టీకి సంప్రదాయంగా వస్తున్న ఓటుబ్యాంకుతో ఉప ఎన్నికల్లో గెలవడం ఈజీ అన్న అంచనాలు ఉండేవి అని అంటున్నారు. అదే సమయంలో 2009 ఎన్నికల తర్వాత ఈ స్థానంలో కాంగ్రెస్ సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయిందనే ధీమా కూడా బీఆర్ఎస్ లో ఉండేది. ఉప ఎన్నిక కాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాలుగు ఎన్నికలు జరిగితే మూడు సార్లు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గెలిచారు. దీంతో ఆయన కుటుంబానికి ఉన్న పట్టుతో గెలిచేస్తామన్న ధీమా బీఆర్ఎస్ లో ప్రస్పుటంగా కనిపించేది.
అందుకే ఈ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రెఫరెండమని చెబుతూ సవాల్ చేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉన్న అనుకూలతను బీఆర్ఎస్ చేజేతులా పాడు చేసుకుందని ఫలితాల తర్వాత ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. గోపీనాథ్ కుటుంబంలో చెలరేగిన వివాదం ముదరకుండా చూసుకోలేకపోవడంతోపాటు మహిళలను దూరం చేసుకునేలా చేసిన ప్రసంగాలు పార్టీకి నష్టం చేశాయని అంటున్నారు. ప్రధానంగా ఉచిత బస్సు పథకంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం మహిళలు లబ్ధిపొందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చిరుద్యోగాలు చేసుకుంటున్న వారికి ఈ స్కీం చాలా ప్రయోజనకరంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆటోడ్రైవర్ల జీవనాన్ని దెబ్బతీశారని బీఆర్ఎస్ విమర్శలు చేయడం తప్పుడు సంకేతాలిచ్చినట్లైందని విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ విమర్శలను అందిపుచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురుదాడి చేసి మహిళల్లో ఆలోచనలు రేకెత్తించారని అంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని, ఉచిత బస్సు రద్దు చేయమంటున్నారని, వారికి ఓటేసి గెలిపిస్తే మహిళలకు ఉచిత బస్సు అవసరం లేదని తీర్పు చెప్పినట్లేనని పలు సభల్లో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు కూడా సీఎం మాటలకు బాగా కనెక్ట్ అయ్యారని తాజాగా ఎన్నికల ఫలితాలను గమనిస్తే అర్థమవుతుందని అంటున్నారు. తొలి నుంచి బీఆర్ఎస్ ఆటోడ్రైవర్లకు అండగా నిలుస్తూ వస్తోంది. అయితే వారి సమస్యలను పరిష్కరించే విషయంపై పోరాడతామని చెప్పాల్సిన పరిస్థితుల్లో తప్పుడు అభిప్రాయానికి తావిచ్చినట్లైందని అంటున్నారు. అందుకే పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన మహిళలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దూరమైనట్లు కనిపిస్తోందని అంటున్నారు.
