తెలంగాణలో బీజేపీకి టీడీపీ టెన్షన్.. పసుపు దళం మద్దతుపై తర్జనభర్జన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి టీడీపీ ఫీవర్ పట్టుకుందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 8 Oct 2025 11:34 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి టీడీపీ ఫీవర్ పట్టుకుందని ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో టీడీపీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పేరు ఎత్తడానికే భయపడిపోతోందని అంటున్నారు. అందుకే కీలక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ మద్దతు కోసం కనీస ప్రస్తావన తేవడం లేదని టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న టీడీపీని తెలంగాణ ఉద్యమంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా దెబ్బతీశారు. తెలంగాణకు టీడీపీయే విలన్ అన్నట్లుగా చూపి ఆ పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీతోపాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబును బూచిగా చూపుతూ బీఆర్ఎస్ అధినేత రాజకీయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుతో జట్టు కడితే తమపైనా తెలంగాణ వ్యతిరేక ముద్రవేసి బీఆర్ఎస్ లాభం పొందాలని చూస్తుందని కమలనాథులు కలవరపడుతున్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇవ్వడంతోపాటు బీఆర్ఎస్ ఖేల్ ఖతం అని ప్రచారం చేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పుడు గెలవడం అత్యావసరమేమీ కాకపోయినప్పటికీ.. ఇప్పుడు గెలిస్తే మరో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో బీజేపీయే ప్రత్యామ్నాయం అని చూపేందుకు బలమైన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఈ కారణంగానే పార్టీ అభ్యర్థి ఎంపికపై తీవ్ర మేథోమధనం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అనేక రకాల ఆలోచనలతో అభ్యర్థి ఎంపికపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. అభ్యర్థి ఎవరు అయినా సరే.. బీజేపీ విజయం సాధించాలంటే ఇక్కడ ఆ పార్టీ చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు ఎక్కువగా ఉండటం, గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమవడంతో ఈ ఎన్నికల్లో మరింత శక్తి సమకూర్చుకోవాల్సివుందని అంటున్నారు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లు, టీడీపీ, జనసేన ఓటర్లు కూడా భారీగానే ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన తెలంగాణ విషయంలో ఆ పార్టీకి భేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ బీజేపీయే తేల్చుకోలేకపోతోందని అంటున్నారు. ప్రధానంగా టీడీపీ మద్దతు తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలనేది ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని విలన్ గా చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికీ పసుపు పార్టీపై అదే వైఖరి కొనసాగిస్తున్నట్లు బీజేపీ భావిస్తోంది. టీడీపీతో కలిస్తే బీజేపీని కూడా తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించి ప్రయోజనం పొందేలా కేసీఆర్ వ్యూహం రచిస్తారని అనుమానిస్తున్నారు. ఇప్పటికీ ఏపీ ప్రాజెక్టుల విషయంలో కఠినంగా వ్యవహరించకుండా తెలంగాణకు నష్టం చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో కాంగ్రెస్ ను, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీని తెలంగాణ రాజకీయాల్లో ఇరుకన పెట్టేలా బీఆర్ఎస్ అనేక విమర్శలు చేస్తోంది. అయితే ఆ విమర్శలు, ఆరోపణలు వల్ల ప్రస్తుతానికి ఎలాంటి నష్టం లేకపోయినా, భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది బీజేపీని టెన్షన్ పెడుతోంది.
వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికలు కన్నా ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో మెరుగైన స్థితిలో ఉందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 8 సీట్లు సాధించిన బీజేపీ.. అక్కడికి ఆర్నెల్ల తర్వాత జరిగిన పార్లమెంట్లు ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుంది. అప్పటి ఓటింగ్ సరళిని లెక్కిస్తే దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బలం పుంజుకుందని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల అధికార పార్టీతో ముఖాముఖి పోటీ ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ విధంగా వచ్చే ఎన్నికల నాటికి హాట్ ఫేవరెట్ గా రంగంలోకి దిగాలని భావిస్తున్న బీజేపీ.. వ్యూహాత్మక తప్పిదంతో బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వకూడదని చూస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో ఎంతటి అవసరం ఉన్నా, తెలంగాణ వరకు టీడీపీతో దూరంగా ఉండాలనే నిర్ణయించుకుందని అంటున్నారు. అందుకే జూబ్లీహిల్స్ లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్న టీడీపీ.. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదని చెబుతున్నారు.
