బీజేపీలో ఆ ఫైర్ ఏమైంది? జూబ్లీహిల్స్ టాక్ లో ఎక్కడుంది?
అయితే తాజా ఉప ఎన్నికతోపాటు గతంలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ వాయిస్ పెద్దగా వినిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
By: Tupaki Political Desk | 30 Oct 2025 12:18 PM ISTతెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నభారతీయ జనతా పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. ప్రధాన పోటీదారుగా గట్టిపోటీ ఇస్తున్నప్పటికీ 2018-23 మధ్య జరిగిన నాలుగు ఉప ఎన్నికలతో పోల్చి చూస్తే, అప్పట్లో కనిపించిన జోరు, ఇప్పుడు తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు జరిగితే, రెండు చోట్ల విజయం సాధించడంతో పాటు మరోచోట గట్టిపోటీ ఇచ్చి ద్వితీయస్థానంలో బీజేపీ నిలిచింది. అయితే తాజా ఉప ఎన్నికతోపాటు గతంలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ వాయిస్ పెద్దగా వినిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణలో పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, గత రెండేళ్ల నుంచి కాంగ్రెస్ సర్కారు పాలిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత బలమైన శక్తిగా ఎదగాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని వెనక్కినెట్టి తామే బీజేపీనే ప్రబల శక్తిగా పోటీపడింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించింది. ఆ రెండు ఉప ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన కమలదళం.. హస్తం పార్టీని మూడోస్థానానికే పరిమితం చేసింది. ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం వరకు వచ్చి ఆగిపోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగు స్థానాన్ని కోల్పోవడమే కాకుండా కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీని అంతటికీ కారణం బీజేపీ కేడర్ పోరాటమే అని చెప్పకతప్పదనే అభిప్రాయం ఉంది.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కమలం పార్టీలో గతంలో ఉన్న ఊపు కనిపించడం లేదనే అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్న బీజేపీ.. ఆ తర్వాత ఆర్నెల్లకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బలమైన శక్తిగా ఎదిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను నామరూపాల్లేకుండా చేసి అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 చోట్ల విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ, బీజేపీలో స్పీడు తగ్గినట్లు కనిపిస్తోందని సొంత కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక, ప్రచారం తీరును ఉదాహరణగా చూపుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ గెలవగా, ఈ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి వరుసగా సికింద్రాబాద్ నుంచి గెలుస్తున్న కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ గెలుపు ఒక విధంగా ప్రతిష్ఠాత్మకంగానే చెబుతున్నారు. ఆయన కూడా జూబ్లీహిల్స్ పై ప్రత్యేక ఫోకస్ చేసినా, కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోల్చుకుంటే క్షేత్రస్థాయిలో బలమైన ముద్ర వేయలేకపోతున్నారని కార్యకర్తల నుంచి నిరసన ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో మిగిలిన రెండు పార్టీలు దూసుకుపోతుంటే, కమలం పార్టీలో మాత్రం ఆ స్థాయిలో హడావుడి కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్ కు ఇద్దరు మంత్రులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా బీఆర్ఎస్ సైతం పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావును రంగంలోకి దింపింది. వీరికి సహాయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ, బీజేపీలో అభ్యర్థి దీపక్ రెడ్డితోపాటు కొద్దిమంది నాయకులే కనిపిస్తున్నారని అంటున్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ లో గట్టిగా ప్రచారం జరగడం లేదని, నేతలు దూసుకుపోవడం లేదని అంటున్నారు.
