బెడిసి కొట్టిన కిషన్ రెడ్డి.. వ్యూహం!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి కనీసం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థాయిలో ఓట్లు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నిలబడింది.
By: Garuda Media | 14 Nov 2025 1:32 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి కనీసం ప్రభావం చూపించలేకపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే స్థాయిలో ఓట్లు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నిలబడింది. వాస్తవానికి బిజెపి సికింద్రాబాద్ ఎంపీ, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ప్రాణప్రదంగా మారింది. సొంత నియోజకవర్గంలో ఉన్న స్థానం కావడం, పార్టీలో తనకు వ్యతిరేకంగా అనేకమంది చక్రం తిప్పుతున్న క్రమంలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ఉప ఎన్నికను కిషన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు,
ప్రచారాల్లోనూ అదే విధంగా అభ్యర్థి ఎంపికలోను కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. లంకలపల్లి దీపక్ రెడ్డి ఆయన అనుచరుడు కావడం.. గతంలో కూడా పోటీ చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీట్ ను గెలిచి తీరుతామని ఆది నుంచి కిషన్ రెడ్డి ఆసలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా పరాజయం పొందారు. అంతేకాదు.. 10 వేల ఓట్లకు పరిమితం కావడంతో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేకుండా పోయిందన్నది పరిశీలకులు చెబుతున్న మాట.
ఒక రకంగా చెప్పాలంటే ఇది బిజెపి అభ్యర్థి లంకలపల్లి దీపక్ రెడ్డి కంటే కూడా కిషన్ రెడ్డికి చాలా కీలకమైన ఉప ఎన్నిక కావడం మరింత విశేషం. అంతేకాదు కేంద్రం నుంచి 40 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆయన పదే పదే చెప్పారు. మరి ఇది నిజమే అయి ఉంటే నియోజకవర్గంలో పదివేల ఓట్లు మాత్రమే ఎందుకు పడ్డాయి అనేది కీలక ప్రశ్న. అంతేకాదు బిజెపిలో నెలకొన్న అంతర్గత విభేదాలు వివాదాలకు నేను కారణం కాదన్నది కూడా ఆయన చెబుతున్న మాట.
కానీ, ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల వ్యూహంలో కానీ నాయకులు కలిసి రాలేదన్నది వాస్తవం. ఏదో తూతూమంత్రంగా బండి సంజయ్ ప్రచారం చేసినప్పటికీ ఇతర ముఖ్య నాయకులు ఎవరు కూడా పెద్దగా ప్రచారంలో పాల్గొనలేదు అన్నది వాస్తవం. ఎలా చూసినా బిజెపి ఓటమి కచ్చితంగా కిషన్ రెడ్డి మెడకు చుట్టుకుందన్నది రాజకీయ నాయకులు విశ్లేషకులు చెబుతున్న మాట. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది.. కిషన్ రెడ్డి స్పందన ఏమిటి.. కేంద్రం ఏం చేస్తుందనేది చూడాలి.
