ఎంఐఎం తటస్థమా? 24 శాతం ఓటు బ్యాంకు
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని రాజకీయ వర్గాలకు కీలకంగా మారింది.
By: Garuda Media | 17 Oct 2025 8:00 PM ISTతెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అన్ని రాజకీయ వర్గాలకు కీలకంగా మారింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ అదే విధంగా బిజెపి లకు ఉప ఎన్నిక అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది. ఈ క్రమంలో తమకు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్లేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన సిపిఐ ని మద్దతు కోరింది. కలిసి రావాలని కూడా విజ్ఞప్తి చేసింది.
ఇక, బీఆర్ ఎస్ విషయానికి వస్తే.. మిత్రపక్షమంటూ ఏదీ లేదు. అంతర్గతంగా మాత్రం ఎంఐఎంతో అధికారంలో ఉన్నప్పుడు కొనసాగారు. ఎంఐఎం పార్టీకి కొన్ని టికెట్లు కూడా ఇచ్చారు. అసెంబ్లీలో కూడా అనుకూలంగా ఎంఐఎం పార్టీకి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక బిజెపి విషయానికి వస్తే ఈ పార్టీ ఎప్పుడూ ఒంటరి పోరే సాగిస్తోంది. ఇప్పుడు పోటీలో ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఉన్న క్రమంలో కీలకమైన ఎంఐఎం ఎవరికి మద్దతు ఇస్తుంది.. ఏ పార్టీకి అనుకూలంగా మారుతుంది.. అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఈ ఉప ఎన్నికల నుంచి దూరంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. బీహార్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో 24% ఓటు బ్యాంకు ఉన్న మైనారిటీ వర్గాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గం శాసిస్తుంది అన్నది అందరికీ తెలిసింది. ఈ ఓటు బ్యాంకు ప్రభావితం కావాలంటే ఎంఐఎం మద్దతు స్పష్టంగా ఉండాలి. ఎంఐఎం కు బలమైన ఓటు బ్యాంకుగా మైనారిటీలు ఉన్న విషయం కూడా తెలిసింది.
ఈ క్రమంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఎంఐఎం పార్టీ తటస్థంగా ఉంటుందా లేకపోతే అంతర్గతంగా ఏ పార్టీకైనా మద్దతిస్తుందా అనేది ఆసక్తిగా మారింది. గతంలో తమకు మేలు చేసిన బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే విషయంపై ఎంఐఎం నాయకులు చర్చిస్తున్నారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం దానికి అనుకూలంగా మారిందని బీఆర్ఎస్ తరచుగా విమర్శలు చేస్తోంది.
దీంతో కాంగ్రెస్ వైపు ఎంఐఎం నాయకులు ముగ్గు చూపుతారని కూడా మరో చర్చ తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతుంది.. ఎంఐఎం తటస్థంగా ఉంటుందా లేక మద్దతిస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా 24% ఓటు బ్యాంకును ప్రభావితం చేయగలిగే పార్టీ ఏ పార్టీ వైపు అండగా ఉంటే ఆ పార్టీ విజయం దక్కించుకుంటుందని జోరుగా సాగుతున్న చర్చ.
