ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఆ పేరును ప్రకటించడం వెనుక అసలు కారణం ఇదే..
అయితే ఒక్క బీజేపీ అభ్యర్థి ఎవరనేదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 15) పార్టీ తమ అభ్యర్థి పేరును ఖరారు చేసింది.
By: Tupaki Political Desk | 15 Oct 2025 5:00 PM ISTజూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కంగ్రెస్, బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ రెండు పార్టీలు నోటిఫికేషన్ కు ముందుగానే తమ అభ్యర్థుల వీరేనని దాదాపుగా ప్రకటించారు కూడా.. అయితే ఒక్క బీజేపీ అభ్యర్థి ఎవరనేదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 15) పార్టీ తమ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఇక సమరంలో నేతలు సై అంటున్నారు. బీజేపీ దీపక్ రెడ్డి పేరును ప్రకటించడం కేవలం అభ్యర్థి ఎంపిక కాదు.. దీని వెనుక బీజేపీ భారీ వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టికెట్ కోసం పోటీ..
జూబ్లీహిల్స్ టికెట్ కోసం చాలా మంది పోటీలో నిలిచారు. అందులో కీర్తిరెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, ఆకుల విజయ, కొంపల్లి మాధవి ఉన్నారు. వీరు బలమైన స్థానిక నెట్‌వర్క్, సామాజిక సమీకరణాలు, పార్టీపై విశ్వాసంతో టికెట్ కోసం పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే కీరోల్ పోషించవచ్చని నాయకులు ఆశతో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి పేరునే ప్రకటించింది.
ఇది సాధారణ నిర్ణయం కాదు. పార్టీ కేంద్ర నాయకత్వం దీన్ని ప్రముఖ మైనార్టీ ప్రభావం ఉన్న నియోజకవర్గంలో సమతుల్య సమీకరణంగా తీసుకున్నట్టు అర్థం అవుతోంది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచే పోటీ చేసి 25,866 ఓట్లు సాధించారు. ఈ పోటీలో ఆయన మూడో స్థానంలో ఉన్నారు. గతంలో కంటే ఆయన చాలా ఓట్లను పార్టీ ఖాతాలోకి మళ్లించాడు. ఈ విషయంలో ఆయన సక్సెస్ రేటును చూసి పార్టీ ఈ సారి అవకాశం కల్పించింది.
సెంట్రల్ ఫిగర్
ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దీపక్ రెడ్డి, పార్టీ యంత్రాంగంలో అత్యంత క్రియాశీలక నాయకుల్లో ఒకరనే చెప్పవచ్చు. కొన్నేళ్లుగా బీజేపీ నగరస్థాయి కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాజికంగా కూడా ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. వ్యాపార, విద్య, సాంస్కృతిక వర్గాల్లో ఆయనకు అనుకూల వాతావరణం ఉంది. పార్టీ అంతర్గతంగా ‘సంఘటనా శక్తి, మానవ వనరుల సమన్వయం’లో ఆయనకు గుర్తింపు ఉంది. ఇదే కారణంగా కేంద్ర నాయకత్వం చివరికి ఆయన పేరునే ఆమోదించింది.
కీలక నియోజకవర్గం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ రాజకీయ మ్యాప్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది సిటీకి గుండెకాయగా కూడా చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న ఓటర్లలో సుమారు ముస్లిం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. అలాగే మధ్య తరగతి, వ్యాపార వర్గాలు అధికంగా ఉన్నారు.
ఇలాంటి ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి ఎంపిక అంటే అది ఒక సామాజిక సమీకరణాల సమతుల్యత ప్రయోగం.
2023లో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. పార్టీ ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇక బీజేపీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేయడంతో నియోజకవర్గంలో త్రిముఖ పోటీ మొదలైంది. ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ తో పాటు ఇటు బీజేపీ నుంచి దీపక్ రెడ్డి రంగంలోకి దిగారు. ఒక్క స్థానం కోసం బలమైన పోరు మొదలవబోతోంది.
ప్రతిష్ఠాత్మక యుద్ధభూమి
బీజేపీ నాయకుడి ప్రకటనతో గెలుపు, ఓటమిపై నియోజకవర్గంలో చర్చ మొదలైంది. ఈ సారి పెద్దమ్మతల్లి (పాత గుడి) గుడి కూల్చివేత అంశాన్ని బీజేపీ బలంగా ఎత్తుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఒక వర్గం ఓటు బ్యాంకు కోసం రెండు పార్టీలు పోటీ పడుతుండగా.. మరో వర్గం ఓటు కోసం ఒక పార్టీ తీవ్రంగా శ్రమించనుంది.
