జూబ్లీహిల్స్ పై హాట్ డిబేట్.. టీడీపీ సెంట్రిక్ గా పాలిటిక్స్
తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
By: Tupaki Political Desk | 8 Nov 2025 12:22 PM ISTతెలంగాణలో హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ అధికార కాంగ్రెస్, విపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ముక్కోణ పోటీ జరుగుతోంది. కానీ, పోటీలో లేని ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఈ మూడు పార్టీల వారు టీడీపీ ఓటర్లు, సానుభూతిపరుల మద్దతు కోసం పరితపిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల నుంచి టీడీపీని దూరం చేయాలని చూసిన వారు సైతం ఆ పార్టీతో తమ బంధాన్ని, అనుబంధాన్ని చెప్పేందుకు పోటీపడుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు.. బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్రవిభజనకు ముందు వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమైన స్థితిలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, తెలంగాణ ప్రాంతం నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేది. ఇక హైదరాబాదు నగరంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్రే ఉంది. ఐటీ అభివృద్ధిలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న చొరవతో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందని చెబుతుంటారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వలస వచ్చిన వారు, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన సెటిలర్లు టీడీపీ మద్దతుదారులుగా పరిగణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరి ప్రభావమే గెలుపోటములను నిర్ణయిస్తారనే అభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుండటంతో తెలుగుదేశం పార్టీ పోటీలో లేకున్నా ప్రధాన చర్చకు కారణమవుతోంది.
ఇక ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు గణనీయంగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయా ఓట్ల కోసం మూడు పార్టీలు పకడ్బందీ వ్యూహంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అంటే ఒంటికాలిపై లేచే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు తెలుగుదేశంలోనే తమ మూలాలు ఉన్నాయని చెప్పుకోవడం విశేషంగా చెబుతున్నారు. ఇటీవల ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ వర్కింగు ప్రెసిడెంట్ కేటీఆర్ టీడీపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నందమూరి తారక రామారావు గారి పేరు నా పేరు ఒక్కటే. తెలుగుదేశం పార్టీ అంటే నాకు అభిమానం. మా నాన్న పుట్టిన పార్టీ తెలుగుదేశం. మా నాన్నకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఆ పార్టీ. తెలుగుదేశం కార్యకర్తలు మాకే ఓటేస్తారన్న బలమైన నమ్మకం ఉంది’’ అంటూ ఆ ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పుకురావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకం చేసేలా గతంలో పావులు కదిపిన బీఆర్ఎస్.. తెలుగుదేశం శాసనసభ్యులను తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ గడ్డపై టీడీపీ అన్న పేరు వినపించడానికి లేదన్నట్లు రాజకీయం చేసిన నేతలు ఇప్పుడు స్వరం మార్చడం చూస్తే.. ఆ పార్టీ సానుభూతిపరుల ప్రభావం ఏమేర ఉందో అర్థమవుతోందని అంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం టీడీపీ ఓట్లపై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. 2023 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బహిరంగంగా చెప్పకపోయినా, పరోక్షంగా రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కాంగ్రెస్ తో సమానంగా టీడీపీ కేడర్ సంబరాలు చేసుకుంది. దీంతో టీడీపీ కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ పర్యటనలో తెలుగుదేశం, ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు పేర్లను పలుమార్లు ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అమీర్ పేట మైత్రీవనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, దానిని తానే ప్రారంభిస్తానని ప్రకటించారు. దీంతో టీడీపీ ఓటర్లపై రేవంత్ రెడ్డి గట్టిగానే గురిపెట్టినట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అధికార, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఓట్లు కోసం పోటాపోటీ పడుతుంటే, ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. తమ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గతంలో టీడీపీలో పనిచేసి ఉండటంతో అప్పటి పరిచయాలను తెరపైకి తెస్తోంది. అదేసమయంలో తమ మిత్రపక్షం ఓట్లు తమకు కాకుండా వేరేవారికి ఎలా పడతాయని ప్రశ్నిస్తోంది.
ఇలా ఎవరికి వారు టీడీపీ ఓటర్లపై గురిపెట్టి రాజకీయం చేయడం చర్చనీయాంశం అవుతోంది. మూడు పార్టీలు టీడీపీ సానుభూతిపరులను ఆకర్షించేలా అడుగులు వేస్తున్నా, టీడీపీ అధినేత చంద్రబాబు, భావి నేత లోకేశ్ కనీసం ఈ ఎన్నికపై ఒక్క మాట కూడా మాటాడలేదు. తమ పార్టీ మద్దతు కూడా ఎవరికి అన్న విషయాన్ని తేల్చలేదు. పోటీకి దూరంగా ఉండమని చెప్పిన టీడీపీ అధినేత.. రాష్ట్రపార్టీ నేతలకు స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. ఎవరి ఆసక్తికి తగ్గట్లు వారు నడుచుకోవాలని చెప్పడమే కానీ, బహిరంగంగా పార్టీ స్టాండ్ బయటపెట్టొద్దని తేల్చిచెప్పారని అంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ లో సైకిల్ ఓటు ఎటు మొగ్గుచూపుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
