జూబ్లీ ఎలక్షన్: కిషన్ రెడ్డికి ప్రాణ సంకటం!
ఇక, మూడో పార్టీ బీజేపీ. ఈ పార్టీ కంటే కూడా.. ఈ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ మరింత ప్రాణ సంక టంగా మారిందనే చెప్పాలి.
By: Garuda Media | 7 Nov 2025 9:08 PM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క టెస్టు పెట్టింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌ను తీసుకుంటే.. కేసీఆర్ హవా పెరిగిందని.. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు కేసీఆర్‌ను ప్రజలు, తెలంగాణ సమాజం కోరుకుంటోందని చెబుతున్న ఆ పార్టీ నాయకులకు.. ఇది నిజమో కాదో తేల్చుకునే తరుణం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రూపంలో వచ్చింది. అందుకే చమటోడుస్తున్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే.. తామకు రాక రాక వచ్చిన అధికారంలో 20 మాసాల తర్వాత.. ప్రజల నాడి, తమ పాలనకు ఇది గీటు రాయిగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో వారుకూడా అదే రేంజ్‌లో ఇంకో మాటలో చెప్పాలంటే.. అంతకన్నా ఎక్కువగానే కష్టిస్తున్నారు.
ఇక, మూడో పార్టీ బీజేపీ. ఈ పార్టీ కంటే కూడా.. ఈ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ మరింత ప్రాణ సంక టంగా మారిందనే చెప్పాలి. కేంద్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేసేందుకు కసరత్తు చేస్తున్న దరిమిలా.. తన సీటును కాపాడుకునేందుకు.. ఇది తురుపు ముక్క కానుందన్న చర్చ కిషన్ రెడ్డి వర్గంలో జోరుగా సాగుతోంది. ఇక, ఘోషామహల్ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత.. రాజా సింగ్.. తరచుగా కిషన్ రెడ్డి విధానాలను తప్పుబడుతున్నారు. ఆయనపై ఒంటెత్తు పోకడలు పోతున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి స్వరానికి బ్రేకులు వేయాలంటే.. జూబ్లీహిల్స్‌లో గెలుపు కిషన్ రెడ్డికి ప్రాణప్రదం.
వీటికంటే కూడా.. తన సొంత నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ విజయం దక్కించుకోవడం ద్వారా తన పార్లమెంటు స్థానంపై పట్టుకోల్పోలేదన్న భావనను రాజకీయ వర్గాల్లో కల్పించాల్సి ఉంది. ఇది మరింతగా కిషన్ రెడ్డిని కలవరపెడుతోంది. ఒకవేళ గెలుపు దక్కక పోయినా.. కనీసంలో కనీసం.. భారీ ఓటు బ్యాంకునైనా సొంతం చేసుకోవాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. తద్వారా.. వచ్చే స్థానిక ఎన్నికల్లో జీహెచ్ ఎంసీలో పట్టు నిలుపుకొనేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్రలు.. ప్రచారాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. వెరసి.. ఏం జరుగుతుందో చూడాలి.
ఇదిలావుంటే..కిషన్ రెడ్డితో సమానంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్‌రావుకు కూడా.. జూబ్లీపోరు టెస్టుగానే మారింది. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చిన తొలి ఎన్నిక ఇదే. దీంతో ఆయన సత్తా ఏంటన్నది కూడా నిరూపించుకునేందుకు ఈ ఉప పోరు కీలకంగామారిందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ ఉప పోరు బీజేపీ కంటే కూడా.. ఆ పార్టీ నాయకుల సత్తాకు.. పరీక్షే పెడుతోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఎలాంటి ఫలితం రాబడతారో చూడాలి. ఇక, గత 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి డిపాజిట్లు కోల్పోవడంగమనార్హం.
