జూబ్లీహిల్స్ రాజకీయాల నుంచి విష్ణు ఔట్.. పీజేఆర్ రాజకీయ వారసుడి భవిష్యత్ అగమ్యగోచరమేనా?
2009 ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జూబ్లీహిల్స్ ఏర్పడింది.
By: Tupaki Political Desk | 10 Oct 2025 8:00 PM ISTఉప ఎన్నికతో జూబ్లీహిల్స్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మూడు ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ఎంపిక చేయగా, బీజేపీ నేడో రేపో తన అభ్యర్థి పేరు ఖరారు చేయనుంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టున్న మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోవడం, చివరికి పీజేఆర్ కుటుంబ సభ్యుల పేర్లను పరిశీలనకు తీసుకోకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పీజేఆర్ కుమారుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉండగా, కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఈ ఇద్దరిని కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ కుటుంబం ప్రాబల్యం తగ్గిపోయిందా? అనే చర్చ మొదలైంది.
2009 ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ ఉండేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జూబ్లీహిల్స్ ఏర్పడింది. ఇప్పటికి నాలుగు సార్లు ఎన్నికలు జరిగితే ఒక సారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, రెండు సార్లు బీఆర్ఎస్ గెలిచింది. అయితే కాంగ్రెస్ తరఫున గెలిచిన విష్ణువర్థన్ రెడ్డి ప్రస్తుతం రాజకీయంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లో చేరారు. 2009లో గెలిచిన విష్ణు 2014, 2018 ఎన్నికల్లో సైతం పోటీ చేశారు. కానీ ఓటమి చెందారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో చివరి నిమిషంలో విష్ణు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ ఓటమి పాలైనా గత రెండేళ్లుగా విష్ణు బీఆర్ఎస్ తరుఫున చురుకుగా వ్యవహరిస్తున్నారు. కానీ, బీఆర్ఎస్ ఆయన పేరును కనీసం పరిశీలనకు తీసుకోలేదు. ఈ విషయమే ఇప్పుడు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని విష్ణు తండ్రి పీజేఆర్ అభిమానులను కలవరపెడుతోంది.
నిజానికి జూబ్లిహిల్స్ నియోజకవర్గ పరిధిలో పీజేఆర్ ప్రాబల్యం ఇప్పటికీ కనిపిస్తుంది. ఆయన భౌతికంగా లేకపోయినా, పీజేఆర్ అభిమానులు ఆయన పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. దీంతో ఈ నియోజకవర్గంలో పీజేఆర్ కుటుంబానికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇది ఎన్నికల్లో గెలిపించేందుకు ఉపయోగపడకపోవడంతో పీజేఆర్ కుమారుడు వరుసగా మూడు సార్లు ఓడిపోవాల్సివచ్చిందని అంటున్నారు. పీజేఆర్ స్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకువెళ్లలేకపోవడం వల్ల విష్ణు రాజకీయంగా వెనకబడిపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూపుతామని బీఆర్ఎస్ విష్ణును పార్టీలోకి తీసుకుందని, కానీ ఇప్పుడు అవకాశం ఉన్నప్పటికీ విస్మరించారని, దీనికి కారణాలు ఏమైవుంటాయనే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది.
గత ఎన్నికల్లో పోటీకి విశ్వప్రయత్నం చేసిన విష్ణు కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సివచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విష్ణు పార్టీ మార్పు వల్లే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ గెలవలేకపోయారని అంటున్నారు. అయితే ఇప్పుడు టికెట్ దక్కించుకోలేని విష్ణు పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం పనిచేస్తారా? లేదా? అన్నదే సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం సానుభూతి పేరుతో మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారని, నెక్ట్స్ ఎన్నికలకు అభ్యర్థిని తానేనని విష్ణు తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందీ లేనిదీ మాత్రం క్లారిటీ లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
