జూబ్లీలో.. ఇక, పెద్దల పాదయాత్రలు!
ఉప ఎన్నిక పోరుకు మరో 7 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం ఊపందుకుంది.
By: Garuda Media | 3 Nov 2025 5:32 PM ISTఉప ఎన్నిక పోరుకు మరో 7 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి వరకు ప్రచారం ఎలా ఉన్నా.. ఇక నుంచి `పెద్ద` ఎత్తున ప్రచారాన్ని ముందుకు సాగేలా నాయకులు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే పాదయాత్రలకు రెండు కీలక పార్టీలు ప్లాన్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్.. ఈ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2023లో ఇక్కడ బీఆర్ ఎస్ విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే.
దీంతో ఆ నేపథ్యాన్ని నిలబెట్టుకునేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఇంటింటి ప్రచా రానికి ద్వితీయ శ్రేణి నాయకులు పరిమితం కావడంతో ఇప్పుడు మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీని వాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌లు కూడా పాదయాత్రకు రెడీ అయ్యారు. పలు వీధుల్లో నాయకులు , మాజీ మంత్రులు పాదయాత్రలు చేస్తూ.. ప్రజలను కలుస్తున్నారు. మరోవైపు.. ఇతర రూపాల్లో జరుగుతు న్న ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.
ఇక, మరో ప్రతిపక్షం బీజేపీ.. కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. గెలుస్తామన్న ధీమా ఉన్నా.. ఆ దిశ గా ఫలితం వస్తుందా, రాదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కనీసం మార్కులు సంపాయించుకునేందు కు మాత్రం ప్రయత్నం చేస్తున్నారన్నది వాస్తవం. అంటే.. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాల న్నది కమల నాథుల సంకల్పం. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఎలా ఉన్నా.. ఇప్పుడు మరింత దూకుడు పెంచారు.
రాజస్థాన్ సీఎం సహా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి బీజేపీ నాయకులను రప్పిస్తున్నారు. ఇక, కేంద్ర మం త్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు అలెర్ట్ అయ్యారు. బండి సంజయ్ సోమవారం ఉదయం పాదయా త్ర ప్రారంభించారు. గల్లీ గల్లీకి తిరుగుతూ.. మోడీ ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. కిషన్ రెడ్డి పాదయాత్ర కాకుండా.. ఇంటింటికీ తిరుగుతున్నారు. మొత్తంగా.. జూబ్లీ పోరులో ఇక నుంచి వేడి పెరగనుందన్నది వాస్తవం.
