ఎంఐఎం ఎఫెక్ట్: బీఆర్ఎస్-కాంగ్రెస్ ఎదురు చూపులు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుకు మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది.
By: Garuda Media | 23 Oct 2025 9:07 AM ISTజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరుకు మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చేనెల 11న పోలింగ్ జరగనుంది. అంటే.. అన్ని పార్టీలకు ప్రచారం కోసం కేవలం 17 రోజుల వ్యవధి మాత్రమే కనిపిస్తోంది. ఈ 17 రోజుల్లోనే ఓటర్లను ముగ్ధులను చేయాలి. రాజకీయ సమీకరణలు చూసుకోవాలి. తమకు అనుకూలంగా మలుచుకోవాలి. అయితే.. ఈ క్రమంలో బీజేపీ క్లారిటీతోనే ఉంది. తమకు కలిసి వచ్చే పార్టీ విషయంపై ఆ పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఒంటరిపోరుకురెడీ అయిపోయింది.
ఇక, ఎటొచ్చీ.. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌లు మాత్రం.. కలిసి వచ్చే పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. 27 శాతం మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పార్టీ కీలక రోల్ పోషించనుందన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెరచాటు మంతనాలు షురూ చేశాయి. కానీ, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ మాత్రం ప్రస్తుతం బీఆర్ ఎన్నికలపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోటీ నుంచి కూడా ఎంఐఎం తప్పుకొంది. కానీ, ఈ పార్టీ మద్దతు ఉంటే.. తమ గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్న ఆ రెండు పార్టీలు.. లెక్కలు వేసుకుని అడుగులు కదుపుతున్నా యి. ఈ క్రమంలో బీఆర్ ఎస్‌కు పాత మిత్రుడు కూడా అయిన.. అసదుద్దీన్.. ఈ దఫా తమకు కలిసి వస్తారని ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, అధికారంలో ఉన్న తమకు కలిసి వస్తారని.. కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకున్నారు. ఈ క్రమంలో ఎదురు చూపులు తప్పడం లేదు.
వాస్తవానికి ఎంఐఎం అంతర్గత చర్చలను చూస్తే.. అంతో ఇంతో బీఆర్ ఎస్ వైపే మొగ్గు చూపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే.. కాంగ్రెస్‌తో ఎంఐఎంకు చాలా విషయాల్లో చెడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు.. కూటమిని ఎంఐఎం ఆశించింది. కానీ, కాంగ్రెస్ ఆ పార్టీని దూరం పెట్టింది. దీనిని ఎంఐఎం నాయకులు అవమానంగా భావిస్తున్నారు. ఈ ప్రభావంతో ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని ఎంఐఎం వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
