జూబ్లీ పోరు: బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి!
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం.. రాజకీయంగానే కాకుండా..సెంటిమెంటు పరంగా కూడా.. అనేక వివాదాలకు కేంద్రంగా మారుతోంది.
By: Garuda Media | 7 Nov 2025 6:00 PM ISTజూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యం.. రాజకీయంగానే కాకుండా..సెంటిమెంటు పరంగా కూడా.. అనేక వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వ్యవహారం నిన్నటి వరకు చర్చకు రాగా.. తాజాగా మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి చేసిన వ్యాఖ్యలు .. అది కూడా బీఆర్ఎస్ కీలక నాయకుడు.. ప్రస్తుత ఉప ఎన్నిక బాధ్యతను భుజాన వేసుకున్న కేటీఆర్ కేంద్రంగా చేసిన ఆరోపణలు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్నాయనే చెప్పాలి.
మరో నాలుగు రోజుల్లో ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ మరణంపైనా.. ఆ సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరించిన తీరుపైనా ఆయన మాతృమూర్తి మహానందకుమారి చేసిన వ్యాఖ్యలు.. ఆరోపణలు ప్రజల మధ్య చర్చకు వస్తే.. అది బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యక్తిగతంగా ప్రభావం చూపించే అవకాశం ఉందన్నది విశ్లేషకులు చెబుతున్నమాట.
ఇక, ఇదే సమయంలో గోపీనాథ్ భార్యగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతను.. అసలు ఆయన భార్య కాదని.. అసలు భార్య మాలినీ దేవి అంటూ..మాగంటి కుమారుడు, అమెరికాలో ఉంటున్న తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కూడా ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన మాతృమూర్తి మాలినీ దేవితోనే గోపీనాథ్‌కు వివాహం జరిగిందని పేర్కొంది. ఈ వ్యవహారం కొన్నాళ్లు చర్చకు వచ్చింది.
ఇప్పుడు తాజాగా 91 ఏళ్ల మహానంద కుమారి నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేయడం.. ఈ వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశంపై తలోరకంగా చర్చలు జరుగుతుండడం గమనార్హం. అయితే.. ఇది వ్యక్తిగత వ్యవహారమని.. పోలింగ్ పై ప్రభావం చూపించే అవకాశం లేదని.. కొందరు చెబుతున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ వ్యవహారాన్ని వచ్చే రెండు రోజులు జోరుగా ప్రచారం చేయాలని చూస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
