Begin typing your search above and press return to search.

బీఆర్ ఎస్ తాంబూలం ఆమెకే.. ఇక యుద్ధం రెడీ!

ఈ ఏడాది జూన్‌లో నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మ‌ర‌ణం చెందారు.

By:  Garuda Media   |   26 Sept 2025 3:18 PM IST
బీఆర్ ఎస్ తాంబూలం ఆమెకే.. ఇక యుద్ధం రెడీ!
X

హైద‌రాబాద్‌లో అత్యంత ధ‌నిక నియోజ‌క‌వ‌ర్గంగా పేరున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ టికెట్‌ను మాగంటి సునీత‌కు కేటాయించింది. 47 ఏళ్ల మాగంటి సునీత ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటికి.. వ్యాపారాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. ఈ ఏడాది జూన్‌లో నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మ‌ర‌ణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌తీమ‌ణి సునీత‌కు పార్టీ టికెట్ ఇచ్చింది.

కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌..

జూబ్లీహిల్స్ ఎన్నిక‌ల్లో 2023లో మాగంటి గోపీనాథ్ బీఆర్ ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. దీంతో ఈ సీటు ను ఎట్టి ప‌రిస్థితిలోనూ నిల‌బెట్టుకోవ‌డం ద్వారా బీఆర్ ఎస్ రాజ‌కీయంగా ప‌ట్టుకోల్పోలేద‌న్న వాద‌న‌ను బ‌ల‌ప‌ర‌చాలని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తొలుత మాగంటి కుమారుడికి టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నా.. సానుభూతి, మ‌హిళా సెంటిమెంటు రెండు క‌లిసి వ‌స్తాయ‌ని భావించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. ఆ మేర‌కు త‌న నిర్ణ‌యాన్ని మార్చు కున్నారు. ఇక‌, ఈ సీటును గెలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది.

అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప పోరును త‌మ పాల‌నకు గీటురాయిగా లెక్క‌లు వేసుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశామ‌ని.. రైతుల‌కు రుణ మాఫీ, 60 వేల‌కు పైగా ఉద్యోగాల క‌ల్ప‌న‌, ఉపాధి క‌ల్ప‌న‌, ఫ్యూచ‌ర్ సిటీ, హైద‌రాబాద్ విస్త‌ర‌ణ‌.. పెట్టుబ‌డులు.. ప్రాజ‌క్టులు, మెట్రో విస్త‌ర‌ణ స‌హా అనేక అంశాలు త‌మ‌కు సానుకూలంగా మారుతాయ‌ని కాంగ్రెస్ నేత‌లు లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు.. అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. కానీ, గెలుపు గుర్రం ఎక్కుతామ‌నే ధీమాతో ఉన్నారు. మ‌రి ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.