కౌంట్ డౌన్ 9 డేస్: ఎవరూ చేసింది చెప్పట్లేదు!
అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నా.. అటు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు.. గతంలో తాము చేసిన పాలనను.. అమలు చేసిన పథకాలను పెద్దగా ప్రస్తావించడం లేదు.
By: Garuda Media | 1 Nov 2025 3:00 AM ISTహైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరుకు ఖచ్చితంగా 9 రోజుల సమయం మాత్రమే ఉంది. నవంబరు 11న ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి ముందు రోజు అంటే.. 10వ తేదీన ప్రచారం ఉండదు.. అంతా నిశ్శబ్దం. దీనికి ముందు రోజు అంటే.. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకే మైకులు ఆపేయాలని.. ప్రచారం నిలిపేయాలి. సో.. ఇతమిత్థంగా చూస్తే.. శనివారం నుంచి ఖచ్చితంగా 9 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది.
ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల ప్రచార పర్వం ఎలా సాగుతోంది? ఎవరెవ రు ఏయే విషయాలను ప్రస్తావిస్తున్నారు? అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారం చూస్తే.. ఎవరికి వారు పొరుగు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. ఇది సహజమే. ఎన్నికలు అంటేనే.. ప్రత్యర్థులను టార్గెట్ చేయడం. అయితే.. ఇదే సమయంలో బీఆర్ ఎస్, కాంగ్రెస్‌లు సెంటిమెంటును నమ్ముకున్నాయని పరిశీలకులు. విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, బీజేపీ మోడీ పేరుతో ప్రచారాన్ని సాగిస్తోంది.
అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఎలా ఉన్నా.. అటు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు.. గతంలో తాము చేసిన పాలనను.. అమలు చేసిన పథకాలను పెద్దగా ప్రస్తావించడం లేదు. నిజానికి కేసీఆర్ పాలన దిగిపోయి.. 20 మాసాలే అయింది. సో.. ఆ పాలన తాలూకు అంశాలను ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ, ఎందుకో.. దానిని వదిలేసి.. హైడ్రా బుల్డోజర్, సునీతమ్మ సెంటిమెంటు, గోపీనాథ్ మంచితనాన్నే బీఆర్ ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా గతంలో కేసీఆర్ పాలనను పెద్దగా గుర్తుకు తేవడం లేదు.
ఇక, కాంగ్రెస్ నాయకులు కూడా తమ ప్రచారాన్ని గడప గడపకు తీసుకువెళ్తున్నా.. 20 మాసాల్లో చేసిన మంచిని ప్రచారం చేసుకోలేక పోతున్నారన్న వాదన వినిపిస్తోంది. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారా వులకు ఎదురైన `అనుభవాలతో` తెరవెనుక ఏం జరిగిందో ఏమో.. ఇప్పుడు కేవలం బీఆర్ ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. అదేసమయంలో సెంటిమెంటును రాజేస్తున్నారు. మైనారిటీ ఓట్లు సహా బీసీలకు న్యాయం చేశామన్న వాదనను వినిపిస్తున్నారు. నిజమైన బీసీ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారు. నవీన్ యాదవ్ బీసీ కావడం.. బీఆర్ ఎస్, బీజేపీలు ఓసీ అభ్యర్థులను ఎంచుకోవడాన్ని కాంగ్రెస్ ప్రజలకు వివరిస్తుండడం గమనార్హం.
