Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫ‌రెండం.. అస‌లు ఈ మాటే విన‌ప‌డ‌దేం?

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాక మొద‌లైంది. ఇది బీఆర్ఎస్ సిటింగ్ స్థానం

By:  Tupaki Political Desk   |   16 Oct 2025 9:45 AM IST
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిఫ‌రెండం.. అస‌లు ఈ మాటే విన‌ప‌డ‌దేం?
X

ఎన్నిక‌లు.. ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌లు..! ప్ర‌తిప‌క్షాల పోరాటానికి ప‌రీక్ష‌లు..! త‌మ విధానాలతో, పాల‌నా తీరుతో ప్ర‌భుత్వాలు ఈ ప‌రీక్ష‌కు వెళ్తుంటాయి. విప‌క్షాలేమో ప్ర‌భుత్వాల తీరును ఎండ‌గ‌డుతూ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంటాయి. ఎవ‌రికైనా అధికార‌మే ఆఖ‌రి గోల్. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా మ‌ధ్య‌లో వ‌చ్చి ప‌డే (ఉప‌) ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా భావిస్తాయి. త‌మ ప‌నితీరుపై న‌మ్మ‌కం ఉంటే ముందుగానే ప్ర‌భుత్వంలోనివారు ఈ ఎన్నిక‌లు మా పాల‌న‌కు రిఫ‌రెండం అని ప్ర‌క‌టిస్తుంటారు. స‌ర్కారు వైఫ‌ల్యం తీవ్రంగా ఉంద‌న‌కుంటే ప్ర‌తిప‌క్షాలే మ‌ధ్య‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌ను రిఫ‌రెండంగా తీసుకోవాల‌ని స‌వాల్ చేస్తుంటాయి.

బీఆర్ఎస్ కంచుకోట లాంటి చోట‌

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాక మొద‌లైంది. ఇది బీఆర్ఎస్ సిటింగ్ స్థానం. దాదాపు 2014 నుంచి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్న‌ట్లు లెక్క‌. ఒక‌సారి టీడీపీ త‌ర‌ఫున‌, రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు దివంగ‌త ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌. ఈ లెక్క‌న చూసుకుంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కంచుకోట. ఇప్పుడు గోపీనాథ్ స‌తీమ‌ణి మాగంటి సునీత‌ను అభ్య‌ర్థిగా నిల‌బెట్టి అటు మ‌హిళా, ఇటు ఎమ్మెల్యే అకాల మ‌ర‌ణం తాలూకు సెంటిమెంట్ రెండు అంశాల‌తోనూ బీఆర్ఎస్ ఉప ఎన్నిక‌ను ఎదుర్కొంటోంది.

ఈసారైనా గెల‌వాల‌ని...

ఇక తెలంగాణ‌లో అధికారంలో ఉన్న‌ కాంగ్రెస్ విష‌యానికి వ‌స్తే ఆ పార్టీ 2009 త‌ర్వాత జూబ్లీహిల్స్ లో ఆ పార్టీకి గెలుపు ద‌క్క‌లేదు. దివంగ‌త పీజేఆర్ హ‌యాంలో ఉమ్మ‌డి ఖైర‌తాబాద్ లో భాగ‌మైన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 2014 నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ప‌రాజ‌యం పాలైంది. 2014లో అధికారంలో ఉండి కూడా (ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న స‌మ‌యం) మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మాత్రం నేరుగా అధికారంలో ఉండి ఉప ఎన్నిక‌లో త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌కు ప‌రీక్ష వంటి సంద‌ర్భంలో ఉంది.

అటు నుంచి ఇటు నుంచి స‌వాల్ లేదే?

సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌భుత్వాల పాల‌న‌కు రిఫ‌రెండంగా భావించాల‌ని స‌వాల్ చేస్తుంటాయి. దీనిని కొన్నిసార్లు (త‌మ సిటింగ్ స్థానం అయితే) ప్ర‌భుత్వాలు సైతం స్వీక‌రిస్తుంటాయి. కానీ, సిటింగ్ సీటును నిల‌బెట్టుకోవాల‌నే ల‌క్ష్యంతో ఉన్న‌ బీఆర్ఎస్ మాత్రం ప్ర‌భుత్వానికి రిఫ‌రెండం స‌వాల్ విస‌ర‌లేదు. ఇటు తెలంగాణ అధికార ప‌క్షం కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నిక త‌మ ప్ర‌భుత్వ పాల‌న‌కు రిఫ‌రెండం అని ముందుకురావ‌డం లేదు.

ముందు ముందు ఉంటుందేమో?

స‌హ‌జంగా ఉప ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షానికి కాస్త మొగ్గు ఉంటుంది. ఎమ్మెల్యే అకాల మ‌ర‌ణంతో కాబ‌ట్టి ఈవిధంగా బీఆర్ఎస్ ప‌ట్ల‌ సానుభూతి క‌నిపిస్తుంది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు అధికార‌, విప‌క్షం ఏదీ రిఫ‌రెండం స‌వాల్ విస‌ర‌లేదు. పోలింగ్ కు ఇంకా 25 రోజుల స‌మ‌యం ఉంది కాబ‌ట్టి ప్ర‌చారం వేడెక్కే కొద్దీ ఏదో ఒక‌వైపు నుంచి స‌వాల్ బ‌య‌ట‌కు వ‌స్తుందేమో చూడాలి.