Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ హాట్ ఫేవరెట్ ఎవరు? వార్ వన్ సైడేనా?

హైదరాబాద్ నగరంలోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేడిపుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   9 Oct 2025 10:00 PM IST
జూబ్లీహిల్స్ హాట్ ఫేవరెట్ ఎవరు? వార్ వన్ సైడేనా?
X

హైదరాబాద్ నగరంలోని కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేడిపుట్టిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు అత్యావసరం అంటుండగా, ప్రతిపక్షం బీఆర్ఎస్ కి ఈ ఎన్నిక ప్రాణ సంకటంగా మారిందని చెబుతున్నారు. ఇక బీజేపీ కూడా ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ఎన్నికను చావోరేవో తేల్చుకోవాల్సిన సమరంగా భావిస్తోందని చెబుతున్నారు.

వచ్చేనెల 11న జరిగే ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి ఖరారుపై తీవ్ర తర్జనభర్జన పడుతోంది. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కమలం పార్టీ ఈ సారి మెరుగైన ప్రదర్శన కోసం పరితప్పిస్తున్నట్లు ప్రస్తుత కసరత్తు సూచిస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపికలో ముందంజలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అంతిమ ఫలితం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. రెండు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడికెస్తున్నాయి.

బీఆర్ఎస్ సిట్టింగు స్థానాన్ని కాపాడుకోడానికి దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య సునీతనే అభ్యర్థిగా నిలుపుతోంది. మాజీ ఎమ్మెల్యే మాగంటి వారసుడిగా పోటీ చేయాలని భావించిన మాగంటి వజ్రనాథ్ అధిష్టానం నిర్ణయంతో షాక్ తిన్నారు. గతంలో గోపీనాథ్ తరఫున నియోజకవర్గంలో పనిచేసిన వజ్రనాథ్ ఇప్పుడు అంతే శ్రద్ధతో పనిచేస్తారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ఎటువంటి అనుభవం లేని సునీతకు కుటుంబమే సర్వస్యంగా పనిచేయాల్సివుంటుంది. ప్రతిపక్షంలో ఉండటం వల్ల సునీత అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సివుంటుందని అంటున్నారు. సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నా, ఆ ఒక్కటి వల్ల వర్క్ అవుట్ అవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇక ఈ స్థానం నుంచి మాగంటి గోపీనాథ్ మూడుసార్లు గెలవగా, రెండు సార్లు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపైన మరోసారి అజారుద్దీన్ పైన పైచేయి సాధించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థానికంగా మంచిపట్టున్న బీసీ నేత నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు ఉన్న చరిత్ర కూడా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే మాజీ మంత్రి పీజేఆర్ మరణం తర్వాత 2009లో ఒకారి మాత్రమే ఇక్కడ నుంచి కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండటంతో పీజేఆర్ అభిమానుల ఓట్లు ఎటు మళ్లుతాయనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇక బీజేపీ గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇస్తుందా? కొత్తవారిని ప్రోత్సహిస్తుందా అనేది చూడాల్సివుంది. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న కమలం పార్టీ ఎన్నికను చాలా సీరియసుగా తీసుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉండటం, ఏపీలో టీడీపీతో పొత్తు, ఆ రాష్ట్ర పురోగతికి కేంద్రం సహకరించడం వంటివి ఆ ప్రాంత ఓటర్లను బీజేపీకి సానుకూలంగా మార్చాయని విశ్లేషిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో దాదాపు 1.40 లక్షల మైనార్టీ ఓటర్లు ఉండటం వారంతా సంఘటితమై కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ను ఎంచుకుంటే పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ బీజేపీకి కునుకు లేకుండా చేస్తోందని చెబుతున్నారు.