Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు.. 150 ఎకరాల భూములపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  A.N.Kumar   |   17 Sept 2026 10:19 AM IST
అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు.. 150 ఎకరాల భూములపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
X

తెలంగాణ శాసనసభ వేదికగా 22-ఏ (నిషేధిత) భూముల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా భూముల అంశంపై జరిగిన చర్చలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల రికార్డులను అక్రమంగా ట్యాంపరింగ్ చేసి.. నకిలీ పట్టాలు సృష్టించారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ భూ కొనుగోళ్లు, విక్రయాల వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా ఆయన సభ దృష్టికి తీసుకురావడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

150 ఎకరాల భూకబ్జా.. నకిలీ రికార్డులు

ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఈదులనాగులపల్లి పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లలోని ప్రభుత్వ భూములకు సంబంధించి భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయి. కోర్టు స్టే అమలులో ఉన్నప్పటికీ అధికారులతో చేతులు కలిపి రికార్డులను ట్యాంపరింగ్ చేశారని ఆయన విమర్శించారు. దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమికి నకిలీ రికార్డులు, పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించారని తెలిపారు. ఈ క్రమంలోనే సదరు నకిలీ పట్టాల భూములను సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మరికొందరికి అంటగట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా బాధితుడే..?

అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీడియా కథనాలు.. ఎమ్మెల్యే వ్యాఖ్యల సారాంశం ప్రకారం ఈ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక బాధితుడేనని తెలుస్తోంది. అక్రమార్కులు సృష్టించిన నకిలీ రికార్డులను నిజమైనవిగా నమ్మి ఆయన ఆ భూమిని కొనుగోలు చేసి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నేరుగా ప్రభుత్వ భూమిని ఆక్రమించారని చెప్పడానికి ఎటువంటి అధికారిక ప్రాథమిక ఆధారాలు వెల్లడికాలేదు.

సమగ్ర విచారణకు డిమాండ్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల భూములు లాక్కునే పార్టీ కాదని.. భూమి లేని నిరుపేదలకు భూములు పంచి భరోసా ఇచ్చిన పార్టీ అని స్పష్టం చేశారు. 22-ఏ నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ట్యాంపరింగ్ చేసి విక్రయించిన అక్రమార్కులపై, సహకరించిన అధికారులపై పూర్తిస్థాయిలో ఉన్నతస్థాయి విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం 22-ఏ పరిధిలోని భూముల సమస్యల పరిష్కారానికి, అక్రమాల అరికట్టడానికి చర్యలు వేగవంతం చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో జరిగే విచారణలోనే ఈ 150 ఎకరాల భూమి కొనుగోలు వ్యవహారంలో అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది.