Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు ?

అయితే ఈ సమావేశం కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం మాత్రమే అని అంటున్నారు.

By:  Satya P   |   13 July 2026 9:17 AM IST
జూనియర్ ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారు  ?
X

జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ యంగ్ టైగర్. ట్రిపుల్ ఆర్ తో ఆయన ఖ్యాతి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కి వ్యాప్తి చెందింది. ఇక పోతే వరస సినిమాలతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఒక ప్రచారం అయితే ఆయన చుట్టూ సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న తన అభిమాన సంఘాలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు అన్నది ఆ ప్రచారంగా ఉంది. మరి ఆ రోజున నిజంగా ఏమి జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్ ఏమి చేయబోతున్నారు అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది.

రాజకీయాల్లోకి అంటూ :

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశీకుడు. మూడవ తరం సినీ హీరో. హరికృష్ణ కుమారుడు. అంతే కాదు తాత ఎన్టీఆర్ పోలికలతో ఆయన ఉండడం ఆయన పేరుతోనే తాను కూడా ముందుకు సాగడం ఇవన్నీ ఆయనకు అడ్వాంటెజెస్ గా ఉన్నాయి. ఇవే కాదు నటనలో తనదైన శైలిలో రాణిస్తూ జూనియర్ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటున్నారు. దాంతో సహజంగానే ఆయన రాజకీయాల్లోకి రావాలని కూడా అభిమానుల నుంచి డిమాండ్ ఉంది. ఇక నందమూరి అభిమానులు కూడా జూనియర్ తాత మాదిరిగా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఏ అడుగు వేసినా అది రాజకీయాల కోసమే అన్న చర్చ అయితే సాగుతోంది. తాజాగా జూనియర్ తన అభిమానులతో భేటీ అవుతున్నారు అని వార్తలు వచ్చినా కూడా దాని మీద కూడా రాజకీయ కధనాలే అల్లుతున్న వారూ ఉన్నారు.

కేవలం అభిమానుల కోసమే :

ఇదిలా ఉండగా జూలై 18న రాజకీయ రంగ ప్రవేశం లేదా భారీ రాజకీయ సభ జరగనుందన్న వదంతులు అవాస్తవమని జూనియర్ ఎన్టీఆర్ బృందం అధికారికంగా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఆ రోజున జరగబోయే ఈ కార్యక్రమం కేవలం అభిమానులతో మమేకమయ్యే ఒక సాధారణ కార్యక్రమం మాత్రమేనని కూడా వివరిస్తున్నారు. అంతే తప్ప ఇది ఏ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభోత్సవానికి సూచన కానే కాదని అంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజున తన అభిమానులను కలిసేది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు, అదే విధంగా తనకు ఉన్న వివిధ అభిమాన సంఘాలను ఒకే ఐక్య కేంద్రీకృత సంక్షేమ కమిటీగా ఏర్పాటు చేయడమే ఈ సమావేశంలో భాగమని ప్రచారం సాగుతూ వస్తోంది. అయితే ఈ సమావేశం కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం మాత్రమే అని అంటున్నారు.

విజయ్ తో పోలిక పెట్టి :

అయితే మరో వైపు ఈ అభిమాన సంఘాల సమావేశాలను కూడా తమిళనాడు సీఎం విజయ్ తో పోలిక పెట్టి మరీ ప్రచారాన్ని మరో మలుపు తిప్పుతున్నారు. విజయ్ కూడా తన అభిమాన సంఘాలను ముందుగా సమావేశం పరచారని వారి ద్వారా మొదట్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని ఆ మీదట రాజకీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని అంటున్నారు. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అభిమాన సంఘాలను ఏక త్రాటిపైకి తీసుకుని వచ్చి వారితో సామాజిక సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేలా రంగం సిద్ధం చేయబోతున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జూలై 18న అసలు ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు అతి పెద్ద చర్చ. జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ తో సమావేశం అయినా కూడా అది కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించేదిగానే ఉంటుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.