అమరావతికి ఫీల్డింగ్ కింగ్ జాంటీ రోడ్స్ - నెక్స్ట్ జనరేషన్ ఛాంపియన్ల వేటలో కూటమి ప్రభుత్వం
దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ హఠాత్తుగా ఏపీలో ప్రత్యక్షమయ్యారు. రాజధాని అమరావతిలో మంత్రి నారా లోకేశ్ తో సమావేశమయ్యారు.
By: Tupaki Political Desk | 16 Jun 2026 5:01 PM ISTదక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ హఠాత్తుగా ఏపీలో ప్రత్యక్షమయ్యారు. రాజధాని అమరావతిలో మంత్రి నారా లోకేశ్ తో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించారు. దీంతో మంత్రి లోకేశ్, లెజండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ మధ్య జరిగిన భేటీ క్రీడా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో వివిధ క్రీడా రంగాలకు చెందిన స్టార్ క్రికెటర్లను రాజధాని అమరావతికి తీసుకువస్తోంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారి సలహాలు సూచనలు తీసుకుంటోందని చెబుతున్నారు.
లోకేష్ ట్వీట్ వైరల్
లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్ పర్యటన వివరాలను పంచుకుంటూ మంత్రి నారా లోకేష్ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు. జాంటీ రోడ్స్‌తో సమావేశం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారుల్లో అచంచలమైన స్ఫూర్తిని, క్రమశిక్షణను నింపిన లెజెండ్ జాంటీ రోడ్స్ అంటూ కీర్తించారు. ‘‘జాంటీ రోడ్స్ తో క్రీడలు, యువజన అభివృద్ధి, క్రీడారంగంలో సరికొత్త ఆవిష్కరణలపై సుదీర్ఘంగా చర్చించాం. అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఉత్తమ క్రీడా పద్ధతులను ఏపీలో అవలంబించడం, రాబోయే తరం ఛాంపియన్లను ఇక్కడే తీర్చిదిద్దడంపై మేమిద్దరం మాట్లాడుకున్నాం’’ అంటూ లోకేశ్ ట్వీ్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని లోకేష్ ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడంతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అకాడమీలను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతున్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వ సంకల్పమని అంటున్నారు. ఇందుకోసం జాంటీ రోడ్స్ లాంటి అంతర్జాతీయ క్రీడా దిగ్గజాల అనుభవాన్ని, గ్లోబల్ నెట్‌వర్క్‌ను ఏపీ ప్రభుత్వం ఉపయోగించుకోవాలని చూస్తోందని చెబుతున్నారు.
ముఖ్యంగా యువతలో క్రీడల పట్ల మక్కువ పెంచడం, క్రీడల్లో ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే మెరుగైన ఫిట్‌నెస్-ఫీల్డింగ్ ప్రమాణాలను స్థానికంగా ప్రవేశపెట్టేలా జాంటీ రోడ్స్ సలహాలు, సూచనలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. అవసరమైతే ఏపీ స్పోర్ట్స్ అకాడమీకి ఆయనను ఒక మెంటార్ లేదా అడ్వైజర్‌గా నియమించుకునే వ్యూహంలో ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అంటున్నారు. మరోవైపు దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు, వ్యాపార-క్రీడా రంగాల అనుసంధానతపై జాంటీ రోడ్స్ ప్రత్యేక దృష్టి పెట్టారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటీవల ఆయన దేశంలోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తూ కార్పొరేట్ సదస్సులు, క్రీడా స్టార్టప్‌ల ప్రమోషన్స్, బిజినెస్ నెట్‌వర్కింగ్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడారంగంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించేందుకు అమరావతిలో మంత్రి లోకేష్‌ను కలిసినట్లు విశ్లేషిస్తున్నాయి.
