భారత్‌ను దూరం చేసుకోవడం అమెరికాకు చేటు!
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను మరింతగా ఎత్తిచూపాయి.
By: A.N.Kumar | 24 Aug 2025 2:00 PM ISTఅమెరికా మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ చేసిన వ్యాఖ్యలు భారత్-అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను మరింతగా ఎత్తిచూపాయి. భారత్ లాంటి వ్యూహాత్మక మిత్రదేశాన్ని అమెరికా దూరం చేసుకోవడం సరికాదని వారు హెచ్చరించారు.
జాన్ కెర్రీ తాజాగా మాట్లాడుతూ.. “అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యంలో సహకారం కంటే ఆదేశాలు, ఒత్తిడి ఎక్కువ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్, అమెరికా వంటి మహా దేశాలు ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా కాదు, పరస్పర గౌరవంతో, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒబామా పాలనలో సహకారం ప్రధానంగా ఉండేది. కానీ ఇప్పుడు విభేదాలు పెరుగుతున్నాయి’’ అని వ్యాఖ్యానించారు.
- నిక్కీ హేలీ సూచన
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ చేసిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలని నిక్కీ హేలీ సూచించారు. “అమెరికా-భారత్ మధ్య ఉన్న దశాబ్దాల స్నేహం, విశ్వాసం ఇలాంటి ఒడిదుడుకులను అధిగమించే బలమైన పునాది. వాణిజ్యం, చమురు వంటి అంశాల్లో బలమైన చర్చలు జరగాలి. చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు భారత్ మిత్రుడిగా ఉండటం అత్యంత కీలకం’’ అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ. యువ జనాభాతో భవిష్యత్తులో చైనాను అధిగమించగలదు. ఇలాంటి మిత్రదేశాన్ని ఆంక్షలతో, ఒత్తిడితో దూరం చేసుకోవడం అమెరికాకు విపత్కరం అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
-ట్రంప్ వైఖరిపై విమర్శలు
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులపై అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. “ఈ చమురు సొమ్ము ఉక్రెయిన్ యుద్ధానికి ఉపయోగపడుతోందని” ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. అంతేకాక భారత్ దిగుమతులపై ట్రంప్ 25 శాతం పెనాల్టీలు విధించడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
దీనిపై భారత వాదన ఏమిటంటే చమురు ధరలు పెరిగితే 150 కోట్ల మంది ప్రజలపై భారం పడుతుంది. తమ అవసరాల కోసం చమురు కొనుగోలు చేయడం తప్పు కాదని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది.
భారత్-అమెరికా సంబంధాలు కేవలం వ్యాపార, వాణిజ్య అంశాలకే పరిమితం కావు. ఇవి వ్యూహాత్మక భాగస్వామ్యం, భద్రతా సహకారం, ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ విధానాలు ఉద్రిక్తతలకు దారితీస్తే, చైనాకు మాత్రమే లాభం చేకూరుతుంది. భారత్‌ను మిత్రదేశంగా నిలుపుకోవడం అమెరికాకు కూడా అత్యంత అవసరం అని నిపుణులు ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.
