జోగి వర్సెస్ వసంత.. చెక్ పెట్టేదెవరు ..!
వైసీపీ నాయకులను నియంత్రిస్తామని నేరుగా వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రెండు రోజుల కిందట తీవ్ర కలకలం రేపాయి.
By: Garuda Media | 18 Sept 2025 7:00 AM ISTవైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వర్సెస్ టిడిపి ప్రస్తుత ఎమ్మెల్యే, సీనియర్ నేత వసంత కృష్ణ ప్రసాద్ కు మధ్య రాజకీయ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కొండపల్లి గనులకు సంబంధించిన వివాదం కొనసాగగా తాజాగా ఇప్పుడు విద్యుత్ ప్లాంట్ కు సంబంధించిన బూడిద విషయంలో ఇద్దరి మధ్య రగడ ఏర్పడింది. గత కొన్నాళ్లుగా ఈ బూడిదను అక్రమంగా తరలిస్తున్నారని, సొమ్ము చేసుకుంటున్నారని జోగి రమేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై ఆయన తీవ్ర స్థాయిలో యుద్ధమే ప్రకటించారు. కానీ, వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం మౌనంగా ఉంటున్నారు.
ఈ విషయంలో తన పాత్ర లేదని చెప్పడం లేదు.. ఉందని చెప్పడం లేదు. మరోవైపు జోగి రమేష్ త్వరలోనే జైలుకు వెళ్తారని జోగి రమేష్ అక్రమాలు తెలుగులోకి వస్తున్నాయని వసంత కృష్ణ ప్రసాద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మైలవరం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా కొండపల్లి, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో ఇరుపక్షాల మధ్య తీవ్ర వివాదాలైతే నడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంటోంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం కూడా కనిపిస్తున్నాయి.
వైసీపీ నాయకులను నియంత్రిస్తామని నేరుగా వసంత కృష్ణ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రెండు రోజుల కిందట తీవ్ర కలకలం రేపాయి. వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని నియంత్రించే అధికారం కానీ, ఒక పార్టీ నాయకులను అడ్డుకునే అధికారం కానీ ఎవరికి ఉండదు. కానీ వసంత కృష్ణ ప్రసాద్ సంయమనం కోల్పోయిన నేపథ్యంలో జోగి రమేష్ అనుచరులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజానికి చెప్పాలంటే మీడియా ముందు ఎలా ఉన్నప్పటికీ అంతర్గత సమావేశాల్లో మరింత దారుణంగా దూషించుకుంటున్నారు.
ఇక వైసిపి నేత జోగి రమేష్ విషయానికి వస్తే ఈయన కూడా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు. ``నువ్వు ఎంత అంటే నువ్వు ఎంత`` అన్నట్టు రాజకీయాలు చేయడంతో పాటు వసంత కృష్ణ ప్రసాద్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గం అవినీతికి ఆలవాలంగా మారిందని, నియోజకవర్గ ప్రజలను దోచుకుంటున్నారని, గనులు, వనరులను కూడా సొంతం చేసుకుంటున్నారని ఆయన రోడ్డెక్కుతున్నారు, తాజాగా ఈ పరిణామాలే మరింత దుమారం రేపటంతో పాటు నియోజకవర్గంలో ఉద్రిక్తతలకు దారితీసింది,
ముందు ముందు కూడా మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేక ఈ విషయంలో అధికార పార్టీ టిడిపి జోక్యం చేసుకొని సర్దుబాటు చేస్తుందా అనేది చూడాలి. మొత్తానికి మైలవరం నియోజకవర్గంలో ఒకప్పుడు లేని వివాదాలు ఇప్పుడు పెరుగుతుండడం, ఒకప్పుడు లేని విమర్శలు ఇప్పుడు వస్తుండడం వంటివి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. దేవినేని ఉమా వరుసగా రెండుసార్లు గెలిచినప్పుడు ఎలాంటి వివాదాలు లేకుండానే నియోజకవర్గంలో రాజకీయాలు సాగాయి.
కానీ, ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ విజయం దక్కించుకున్న తర్వాత వివాదాలు పెరుగుతుండడం, ప్రతి అంశంలోనూ ఏదో ఒక సమస్య తెరమీదకు వస్తుండడం వంటివి వివాదానికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి అక్రమాలు వంటివి తొలిసారి ఇక్కడ వినిపిస్తుండడం వంటివి స్థానికులను కూడా ఆవేదనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి ఇవి ఎటు దారి దారితీస్తాయి అనేది చూడాలి.
