జోగి ఎఫెక్ట్: అర్ధరాత్రి విజయవాడలో ఉద్రికత్త.. పోలీసులపై జులుం!
రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే జోగి కుటుంబం అక్కడకు చేరుకుంది.
By: Garuda Media | 3 Nov 2025 11:10 AM ISTవైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, జోగి అభిమానులు వందల సంఖ్యలో విజయవాడలో గత అర్ధరాత్రి తీవ్ర హంగామా సృష్టించారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్, ఆయన సోదరుడు రామును అరెస్టు చేసిన పోలీసులు.. సుదీర్ఘంగా 12 గంటల పాటు విచారించారు. అనేక ప్రశ్నలు సంధించారు. అనంతరం.. వైద్య పరీక్షల కోసం.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకురాగా.. అప్పటికే జోగి కుటుంబం అక్కడకు చేరుకుంది. వీరితోపాటు.. వారి అనుచరులు కూడా వచ్చారు. పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు.. ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన.. పోలీసులపై దౌర్జన్యానికి దిగినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా జోగి కుమారుడు రాజీవ్ ప్రోద్బలంతోనే కార్యకర్తలు, అనుచరులు పోలీసు అధికారులపై దూషణలకు దిగి.. వారిని అడ్డుకోబోయినట్టు చెప్పారు.
సుమారు 70 మందిపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పోలీసులను తిట్టడం, వారిపై దూషణలకు పాల్పడడం, విధులకు ఆటంకం కలిగించడం.. ఓ ఎస్సైపై చేయి చేసుకునే ప్రయత్నం చేయడం వంటి నేరాలపై వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇదిలావుంటే.. ఆసుపత్రి లో చోటు చేసుకున్న హంగామాతో అప్పుడే అత్యవసర చికిత్స నిమిత్తంవచ్చిన ఓ కుటుంబం తీవ్రస్థాయిలో ఇబ్బంది పడింది. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆదారంగా కూడా మరో కేసు నమోదు చేశారు.
జోగిపై ప్రశ్నల వర్షం..
ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు జోగి, ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ సహా ప్రత్యేక దర్యాప్తు బృందం(ప్రభుత్వం నియమించింది) అధికారులు అనేక కోణాల్లో ప్రశ్నించారు. వీటిలో ప్రధానంగా నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్ధన్‌రావుతో ఉన్న సంబంధాలు, ఆయన చెప్పిన వాంగ్మూలం ఎదురు గా ఉంచి కూపీ లాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతరం వారి వద్ద ఉన్న ఆధారాలతో సరిచూసుకుని.. రిమాండ్ రిపోర్టును రూపొందించాయి.
