జోగికి దక్కని ఓదార్పు.. జగన్ ఆలోచన మారిందా?
ఇక ఈ నెల 4న నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి జోగికి పార్టీ నుంచి అందుతున్న సహకారంపై విస్తృత చర్చ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 10 Nov 2025 5:00 PM ISTకల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు అయి వారం రోజులు దాటుతోంది. ఈ నెల 2న ఆయన అరెస్టు కాగా, ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వ్యవహరిస్తున్నారు. 13వ తేదీవరకు ఆయన రిమాండ్ ఉంది. కోర్టు ఈ రిమాండును పొడిగిస్తుందా? లేక బెయిలు మంజూరు చేస్తుందా? అన్నది ఆ రోజు జరిగే విచారణలో తేలాల్సివుంది. బెయిలు కోసం మాజీ మంత్రి జోగి తరఫు న్యాయవాదులు న్యాయపోరాటం చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో జోగి పేరు తెరపైకి వచ్చిన నుంచి ఆయన చాలా ఆందోళన చెందారు. తన తప్పు లేదని చెప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దేవుడిపై ఓట్టు పెట్టి, దీపాలు ఆర్పి తాను సచ్చీలుడిగా చెప్పుకున్నారు. కానీ, ఆయనను పోలీసులు విడిచిపెట్టలేదు.
తన తప్పులేదని జోగి ఎంత గగ్గోలు పెట్టినా, ప్రభుత్వం విడిచిపెట్టలేదు. ఇక ఈ నెల 4న నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లిన మాజీ మంత్రి జోగికి పార్టీ నుంచి అందుతున్న సహకారంపై విస్తృత చర్చ జరుగుతోంది. కల్తీ మద్యం కేసులో జోగిని ఇరికించారని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారనే కారణంగానే జోగిపై తప్పుడు కేసు బనాయించారని వైసీపీ విమర్శలు చేస్తోంది. అయితే కేసు ఏదైనా కోర్టు రిమాండ్ విధించడంతో జైలు పాలైన జోగిని తన పార్టీ నేతలు ఎవరూ పరామర్శించకపోవడమే చర్చకు దారితీస్తోంది. ఈ నెల 4న సెంట్రల్ జైలుకు వెళ్లిన జోగికి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు మాత్రమే కలిశారు. మాజీ మంత్రి కాకాణి, ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖరరెడ్డి మాత్రమే జోగి జైలుకు వెళుతుండగా, వచ్చి ఓదార్చారు.
కానీ, ఇంతవరకు వైసీపీకి చెందిన ఏ నేత జైలులో జోగిని కలవకపోవడానికి కారణాలేంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జలతోపాటు వైసీపీ కీలక నేతలు అంతా జోగి అరెస్టును ఖండిస్తూ ప్రకటనలిచ్చారు. కానీ, ఏ ఒక్కరూ ఆయనను కలిసేందుకు నెల్లూరు వెళ్లకపోవడంపై హాట్ డిబేట్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో చాలా మంది అరెస్టు అయ్యారు. అయితే ముఖ్యనేతలు అరెస్టు అయితే మాజీ సీఎం జగన్ వ్యక్తిగతంగా జైలుకు వెళ్లి వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించేవారు. మాజీ మంత్రి కాకాణి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని, మాజీ ఎంపీ నందిగాం సురేశ్ వంటివారు జైలులో ఉంటే మాజీ సీఎం జగన్ ఆయా జైళ్లకు వెళ్లి తన పార్టీ నేతలను ఓదార్చి వచ్చేవారు. కానీ, జోగి విషయంలో మాత్రం అధినేత ఆలోచన ఏంటి అన్నది ఇంతవరకు బయటపడలేదు.
అయితే, వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం జోగి పరామర్శపై అధినేత జగన్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఆయనకు కొద్ది రోజుల్లో బెయిలు వచ్చే పరిస్థితి ఉందని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. బెయిలుపై బయటకు వచ్చాక జోగి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారని వైసీపీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితేతమ నేత వారం రోజులు పైగా జైలులో ఉండటంతో డీలాపడ్డారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ నేతలు వచ్చి కలిస్తే జోగితోపాటు ఆయన కుటుంబానికి ధైర్యం వస్తుందని అంటున్నారు. కానీ, పార్టీలో ఇంతవరకు జోగి పరామర్శపై చర్చించే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత అయిన జోగిని ఆ జిల్లాకు చెందిన నేతలు కూడా కలకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
