జోగిపై టీడీపీ స్కెచ్ ఏంటి? అరెస్టు లేకుండా టెన్షన్ పెట్టే వ్యూహమా?
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దనరావు విడుదల చేసిన వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పై పలు ఆరోపణలు చేశారు.
By: Tupaki Political Desk | 20 Oct 2025 12:00 AM ISTవైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ఉంటుందా? ఉండదా? అనేదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దనరావు విడుదల చేసిన వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు మాజీ మంత్రి రమేష్ తమతో కల్తీ మద్యం తయారు చేయించారని నిందితుడు ఆరోపించాడు. ఈ వీడియో బటయకు వచ్చిన నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ఖాయమంటూ ప్రచారం జరిగింది. అయితే వీడియో బయటకు వచ్చి వారం రోజులైనా మాజీ మంత్రి జోగిపై కేసు నమోదు చేయలేదు. దీంతో ప్రభుత్వం వ్యూహం ఏమైవుంటుందనేది సస్పెన్స్ గా మారింది.
ప్రభుత్వం తనను అరెస్టు చేయడానికి కట్టుకథలు అల్లుతోందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపిస్తున్నారు. అయితే పరిస్థితులు గమనిస్తే మాజీ మంత్రిని అరెస్టు చేయడం కన్నా, ఆ పేరుతో టెన్షన్ పెట్టడమే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జోగి రమేష్ ప్రమేయం ఉందంటూ వారం రోజుల క్రితమే ఏ1 నిందితుడు వీడియో లీకైనా ఎక్సైజ్ అధికారులు ఇంతవరకు జోగిపై అభియోగాలు నమోదు చేయలేదు. ఇదే సమయంలో జనార్దనరావుతో జోగి రమేష్ కి వ్యాపార భాగస్వామ్యం ఉందని నిరూపించేలా రకరకాల లీకులు విడుదల చేస్తున్నారు.
నిందితుడు జనార్దనరావుతో వాట్సాప్ చాటింగ్ చేశారని ఒకసారి, ఫంక్షన్లలో కలిసిమెలిసి ఉన్నట్లు చూపే ఫొటోతో మరోసారి మాజీ మంత్రి జోగి రమేష్ పై ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఏ1 జనార్దనరావు విడుదల చేసిన వీడియో ఒక్కటే జోగి రమేష్ అరెస్టుకు ఆధారం కాదనే ఆలోచనతోనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. మాజీ మంత్రిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురిచేయడం ద్వారా ఇంకేమైనా ఆధారాలు బయటకు వచ్చే చాన్స్ ఉందా? అనే ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అందుకే మాజీ మంత్రి అరెస్టు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, కానీ అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారంతో ఆయనను టెన్షన్ పెడుతోందని చెబుతున్నారు.
గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఆయన ఇంటిపై దాడికి వెళ్లిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అన్నిరకాలుగా కార్నర్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. ఒకసారి అరెస్టు చేస్తే, వెంటనే బెయిలు లభించకూడదన్నట్లు ప్రభుత్వ ఆలోచన ఉందని, అందుకే సరైన ఆధారాల కోసం వేచిచూస్తోందని సందేహిస్తున్నారు. అందుకే వారం రోజులుగా లీకులు ఇవ్వడమే కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో తన అరెస్టు తప్పదనే ఆలోచనతో ఉన్న జోగి రమేష్ వరుస పెట్టి మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేస్తున్నారని అంటున్నారు.
ప్రభుత్వం తాజా వ్యూహాన్ని పరిశీలిస్తే గతంలో వల్లభనేని వంశీని అరెస్టు చేసిన ఉదంతం గుర్తుకు వస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వంశీ అరెస్టుకు ముందు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు మాత్రమే పెండింగులో ఉండేదని, అయితే ఆ కేసులో అరెస్టు చేస్తే వెంటనే బెయిలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగిన సమయం కోసం ఎదురుచూసిందని గుర్తు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఫిర్యాదుదారు సత్యవర్థన్ తో వంశీ రాజీకి ప్రయత్నించడం ప్రభుత్వానికి ఆయుధంగా మారిందని, సత్యవర్థన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, ఆ తర్వాత ఆ ఎపిసోడ్ ను ఎలా ముందుకు తీసుకువెళ్లిందీ గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇష్యూలో కూడా ప్రభుత్వం అదేవ్యూహాన్ని అనుసరించనుందా? అని సందేహిస్తున్నారు. మొత్తానికి జోగి ఎపిసోడ్ లో టెన్షన్ పెట్టడమే ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.
