Begin typing your search above and press return to search.

ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం.. మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు..

తల్లిదండ్రులుగా తమ కుమారుడు రాజీవ్, కోడలు మేఘనల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించామని జోగి రమేష్ తెలిపారు.

By:  A.N.Kumar   |   24 Aug 2026 1:45 PM IST
ఫేక్ వీడియోలు, ఆడియోలతో దుష్ప్రచారం.. మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు..
X

సమాజానికి ఏమాత్రం అవసరం లేని.. వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను మీడియాలో ఎలా పడితే అలా రచ్చ చేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంపై ఇటీవల నమోదైన కేసుతో పాటు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన అమరావతిలో మీడియా ముందుకు వచ్చి తొలిసారిగా విస్తృతంగా వివరణ ఇచ్చారు.

తల్లిదండ్రులుగా తమ కుమారుడు రాజీవ్, కోడలు మేఘనల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు శాయశక్తులా ప్రయత్నించామని జోగి రమేష్ తెలిపారు. పెళ్లి తర్వాత తన కోడలిని కన్న కూతురిలాగే చూసుకున్నామని.. దంపతుల మధ్య సఖ్యత కోసమే తాము నిరంతరం తాపత్రయపడ్డామని పేర్కొన్నారు. అయితే మనస్పర్థలు తీవ్రమవ్వడంతో వివాదం చివరికి కోర్టు దాకా వెళ్ళిందని వివరించారు. ఈ క్రమంలోనే జూన్ 8న విడాకుల కోసం పిటిషన్ దాఖలు కాగా.. జూలై 24న తమ కుటుంబంపై మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున పూర్తి వివరాలపై తాను ఎక్కువగా మాట్లాడలేనని స్పష్టం చేశారు.

అయితే ఈ కుటుంబ వివాదాన్ని అడ్డుపెట్టుకుని తనపై, తన కుటుంబ సభ్యులపై పగబట్టినట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నెల రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేక్ వీడియోలు, ఆడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌లో తమ కుటుంబంపై మతమార్పిడి వంటి అనవసరమైన ఆరోపణలు చేర్చడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ భార్య ఇంట్లో ప్రార్థనలు చేయడం.. బైబిల్ చదవడం నేరమా అని ప్రశ్నించిన ఆయన, తమ కుటుంబం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని తేల్చిచెప్పారు. తిరుపతి, శ్రీశైలం, దుర్గగుడి సందర్శనలతో పాటు యాగాల్లో కూడా తమ కుటుంబం పాల్గొంటుందని గుర్తుచేశారు.

ఇదే సమయంలో తన కోడలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయానికి వెళ్లిన వీడియోలను ప్రస్తావిస్తూ ఈ పర్సనల్ మ్యాటర్‌ వెనుక రాజకీయ జోక్యం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. సరైన సమయంలో వాటన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు. ఎన్టీఆర్, అక్కినేని వంటి పెద్ద పెద్ద ప్రముఖుల కుటుంబాల్లోనూ వ్యక్తిగత సమస్యలు ఉండవా అని ప్రశ్నించిన జోగి రమేష్.. తనలాంటి బీసీ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ స్థాయి దిగజారుడు రాజకీయం చేస్తున్నారని నిలదీశారు.

కుటుంబ సమస్యను కుటుంబ పరిధిలోనే లేదా చట్టపరంగా ముగించుకోవాల్సి ఉండగా.. దానిని బహిరంగ చర్చగా మార్చడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంలో ఇరు వర్గాల వాదనలు.. పోలీసుల సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేశారు.