Begin typing your search above and press return to search.

బాబోయ్‌... అదేం తిండిరా నాయనా!

అమెరికా ఇండిపెండెన్స్‌డే సందర్భంగా జులై 4వ తారీకున దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు.

By:  Ramesh Palla   |   7 July 2026 3:28 PM IST
బాబోయ్‌... అదేం తిండిరా నాయనా!
X

అమెరికా ఇండిపెండెన్స్‌డే సందర్భంగా జులై 4వ తారీకున దేశ వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ఉత్సవాలు, వేడుకలు, కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా దేశ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, సంఘాలు, స్వచ్చంద సంస్థలు సైతం ఇండిపెండెన్స్ డే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. న్యూయార్క్‌లోని కోని ఐలాండ్‌లో అమెరికా ఇండిపెండెన్స్ డే సందర్భంగా వింత పోటీ జరుగుతుంది. ఈ పోటీలో గెలిచిన వారికి భారీ మొత్తంలో ప్రైజ్ మనీ ఉంటుంది. పది ఇరవై సంవత్సరాల నుంచి కాకుండా ఏకంగా 110 ఏళ్లు గా ఈ పోటీ జరుగుతుంది. కేవలం తినడం ద్వారా పోటీలో నెగ్గి పెద్ద మొత్తంలో ప్రైజ్‌ మనీ గెలుచుకోవచ్చు. ఈసారి ప్రైజ్ మనీ ఏకంగా 10 వేల డాలర్లను జోయ్‌ చెస్ట్‌నట్‌ అనే వ్యక్తి గెలుచుకున్నాడు.

10 నిమిషాల్లో ఎక్కువ హాట్‌ డాగ్స్‌...

ఇంతకు పోటీ ఏంటి? ఏం చేయాలి అనే కదా... పోటీ వివరాల్లోకి వెళ్తే.. పోటీదారులు 10 నిమిషాల వ్యవధిలో ఎక్కువ హాట్‌ డాగ్స్‌ను తినాల్సి ఉంటుంది. అమెరికాలో అత్యధికులు తినే ఆహారం హాట్ డాగ్స్ అనే విషయం తెల్సిందే. బ్రెడ్‌, సాసేజ్‌ మాంసం కలిపి తయారు చేసే ఈ ఆహార పదార్థంను అమెరికాలో ధనికుల నుంచి పేదవారి వరకు అంతా తింటారు. అందుకే పోటీలో హాట్‌ డాగ్స్ ను ఉంచి ఉంటారని అంటారు. ఈ ఏడాది పోటీలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. పోటీదారులు హాట్‌ డాగ్స్‌ను నీటిలో ముంచుకుని తినవచ్చు. అలా తినడం వల్ల బ్రెడ్‌ నీటిలో మెత్తబడి తినడానికి ఈజీగా ఉంటుంది. ఎంత స్పీడ్‌ గా తిన్నా అయిదు పది కంటే ఎక్కువ తినడం సామాన్యులకు సాధ్యం కాదు. కానీ పోటీలో పాల్గొన్న వారు ముందస్తుగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కనుక పది ఇరవై ముప్పై కూడా తిన్నారు. అయితే జోయ్ మాత్రం ఏకంగా 67 హాట్ డాగ్స్ ను కేవలం 10 నిమిషాల వ్యవధిలో తినేశాడు.

అమెరికా ఇండిపెండెన్స్‌ డే...

నిర్ణీత సమయంలో ఎన్ని తింటారో అన్ని హాట్ డాగ్స్‌ కడుపులోనే ఉండాలి. తిన్న వెంటనే వాంతులు చేసుకోవడం చేయకూడదు. అలా వాంతులు చేసుకుంటే డిస్‌క్వాలిఫై చేస్తారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న వారిని విజేతగా ప్రకటిస్తారు. ఎన్ని తింటే అన్ని కడుపులోనే వాంతులు కాకుండా ఉంచుకోవడం మామూలు విషయం కాదు. ఇక పది నిమిషాల తర్వాత నోట్లో ఉన్న హాట్‌ డాగ్స్ ను కంప్లీట్‌ చేయడానికి 30 సెకన్ల సమయం ఇస్తారు. ఆ సమయంలోపు మొత్తం తినేసి నోరు ఖాళీగా ఉంచుకోవాలి. తినే సమయంలో ఎక్కువగా వేస్ట్‌ కాకుండా చూసుకోవాలి. హాట్‌ డాగ్స్‌ను వేస్ట్‌ చేస్తూ కంది పడేసిన వారిని కూడా డిస్‌క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇన్ని కండీషన్స్ మధ్య 10 నిమిషాల్లో ఏకంగా 67 హాట్‌ డాగ్స్ తిన్నాడంటే వాడు మనిషి కాదు కుంభకర్ణుడు అని కొందరు సోషల్‌ మీడియాలో సరదాగా జోకులు వేసుకుంటున్నారు.

ESPN స్పోర్ట్స్ ఛానల్‌ లో లైవ్‌...

1916 నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీని చూసేందుకు వేలాది మంది తరలి వస్తారు. అంతే కాకుండా ఈ కార్యక్రమాన్ని లైవ్‌ ఇచ్చే స్పోర్ట్స్ ఛానల్‌ ESPN ను ఆ రోజు కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా చూస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వింత ఆటకు అభిమానులు ఉన్నారు. ప్రతి ఏడాది ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. జోయ్‌ చెస్ట్‌నట్‌ ఇప్పటి వరకు 17 సార్లు విజేతగా నిలిచాడు. ఇప్పుడు 18వ సారి అతడు ఈ తిండి పోటీలో విజేతగా నెగ్గాడు. అతడు ఈ పోటీలో పాల్గొనేందుకు ఏడాది అంతా చాలా వర్కౌట్స్ చేస్తాడు. తిన్నది వెంటనే అరిగేందుకు ఎక్కువగా నీళ్లు తాగుతాడు. కడుపు సైజ్‌ పెంచుకునేందుకు ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్‌లు సైతం చేస్తాడట. అందుకే ఇన్ని సార్లు అతడు విజేతగా నిలిచాడు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అదే రోజు అమ్మాయిలకు కూడా ఇదే పోటీ ఉంటుంది. మికి సుడో అనే మహిళ 10 నిమిషాల్లో 39 హాట్ డాగ్స్‌ను తినడం ద్వారా విజేతగా నిలిచింది. ఈమె 12వ సారీ ఈ పోటీలో విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు.