Begin typing your search above and press return to search.

బైడెన్‌ శరీర భాగాలకూ పాకిన క్యాన్సర్.. కొడుకు హంటర్‌ ఎమోషనల్

జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు 2025 మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

By:  A.N.Kumar   |   9 Aug 2026 1:03 PM IST
బైడెన్‌ శరీర భాగాలకూ పాకిన క్యాన్సర్.. కొడుకు హంటర్‌ ఎమోషనల్
X

అమెరికా మాజీ అధ్యక్షుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 83 ఏళ్ల జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శరీరంలోని ఇతర భాగాలకు, ముఖ్యంగా ఎముకలకు ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపించినట్లు ఆయన కుమారుడు హంటర్ బైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తండ్రి ఎదుర్కొంటున్న ఈ కఠిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ హంటర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

క్యాన్సర్ వ్యాధి తండ్రిని శారీరకంగా ఎంతో బలహీనపరుస్తోందని.. ఒక కొడుకుగా ఈ పరిస్థితిని దగ్గర నుండి చూడటం చాలా బాధాకరంగా ఉందని హంటర్ పేర్కొన్నారు. అయితే ఎంతటి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ బైడెన్ తన దైనందిన కార్యకలాపాలను సాధ్యమైనంత వరకు కొనసాగిస్తున్నారని తెలిపారు. తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఆయన ఇప్పటికీ ఎంతో ఆసక్తి చూపుతున్నారని, నిరంతరం దేశం, అమెరికా ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచిస్తున్నారని హంటర్ వివరించారు.

మెటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్ సవాలు

జో బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు 2025 మే నెలలో అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల్లో ఈ వ్యాధి ప్రొస్టేట్ గ్రంథిని దాటి ఎముకలకు కూడా విస్తరించినట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో దీనిని 'మెటాస్టాటిక్ ప్రొస్టేట్ క్యాన్సర్' అని పిలుస్తారు. సాధారణంగా ఈ నాల్గవ దశలో క్యాన్సర్ కణాలు ప్రాథమిక ప్రాంతం నుండి శరీరంలోని ఇతర కీలక భాగాలకు వేగంగా వ్యాపిస్తాయి. బైడెన్ వయసు, వ్యాధి తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఇది అత్యంత సంక్లిష్టమైన దశ అని నిపుణులు భావిస్తున్నారు.

దశాబ్దాల రాజకీయ ప్రస్థానం

2021 నుండి 2025 వరకు అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన బైడెన్, అంతకుముందు బరాక్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా కూడా సేవలు అందించారు. దశాబ్దాల పాటు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ఆరోగ్యం క్షీణించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన మద్దతుదారులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బైడెన్ కుటుంబ సభ్యులు ఆయనకు అండగా ఉంటూ అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎంతటి బలహీనత ఆవహించినా ధైర్యంతో దేశం పట్ల అంకితభావంతో ము ముందుకుసాగుతున్న బైడెన్ మనోధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.