Begin typing your search above and press return to search.

ఫస్ట్ పోస్టింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మహిళా అధికారి!

ఈ సమయంలో శర్మ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. వెంటనే ఆమెను అక్కడికక్కడే అరెస్టు చేశారు.

By:  Garuda Media   |   16 Oct 2025 2:00 AM IST
ఫస్ట్  పోస్టింగ్  లో రెడ్  హ్యాండెడ్  గా పట్టుబడ్డ మహిళా అధికారి!
X

ఎంతో కష్టపడి చదివి, మంచి ర్యాంక్ తో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పాసై, మంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఓ మహిళా అధికారి.. తన ఫస్ట్ పోస్టింగ్ లో తొలిసారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది! మరోవైపు నెట్టింట వైరల్ గా మారింది! ఈమెకు అది ఫస్ట్ పోస్టింగ్ కాగా.. ఈ విధంగా లంచం తీసుకోవడం కూడా ఫస్ట్ టైం అని అంటున్నారు.

అవును... జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువ ప్రభుత్వ అధికారిణి మిథాలీ శర్మ తన మొదటి అధికారిక నియామకంలో లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) కి చిక్కారు. ఈ సంఘటన కోడెర్మా జిల్లాలో జరిగింది. హజారీబాగ్‌ లోని అవినీతి నిరోధక బ్యూరో ప్రకారం.. ఆమె డిమాండ్ చేసిన రూ.20,000 లంచంలో మొదటి విడతగా రూ.10,000 తీసుకుంటుండగా ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ లో దొరికింది.

వివరాళ్లోకి వెళ్తే... మిథాలీ శర్మ సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌ గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో.. వ్యాపార్ సహయోగ్ సమితి తనిఖీ సమయంలో ఆమె కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించి, సమస్యను పరిష్కరించడానికి డబ్బు డిమాండ్ చేసినట్లు సదరు సమితి సభ్యుడు రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ నుండి ఏసీబీకి ఫిర్యాదు అందింది. వెంటనే ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది.

ఈ సమయంలో శర్మ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.. వెంటనే ఆమెను అక్కడికక్కడే అరెస్టు చేశారు. అధికారిక ప్రక్రియలో భాగంగా ఈ ఆపరేషన్‌ ను వీడియోలో చిత్రీకరించారని తెలుస్తోంది. అరెస్టు తర్వాత ఆమెను విధుల నుండి సస్పెండ్ చేసి, ఇంటర్నల్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు!

వాస్తవానికి ఈ ఘటన 2023 జూలై 7న జరగగా... దీనికి సంబంధించిన ఫోటోలు, పోస్టులు సోషల్ మీడియాలో తాజాగా ఒక్కసారిగా వైరల్ గా మారాయి.

కాగా... మిథాలీ శర్మ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, తన మొదటి ప్రయత్నంలోనే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) పరీక్షలో 108వ ర్యాంక్‌ సాధించింది. దీంతో కేవలం 22 సంవత్సరాల వయసులోనే ఆమె తన బ్యాచ్‌ లోని అతి పిన్న వయస్కులలో ఒకరిగా రికార్డ్ సృష్టించారు. ఫలితంగా... ఆమెకు సమాజంలో గౌరవం, ప్రశంసలు రెండూ దక్కాయి.