షాకింగ్... దేశంలో ఐదు మంది పిల్లలకు హెచ్.ఐ.వీ. పాజిటివ్!
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అంతటా ఆగ్రహాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. దీనితో రాంచీ నుండి ఉన్నత స్థాయి వైద్య బృందం తక్షణ దర్యాప్తు చేపట్టింది.
By: Raja Ch | 26 Oct 2025 7:00 PM ISTవైద్యంలో నిర్లక్ష్యం జరిగితే ఎలాంటి ఘోరాలు జరుగుతాయనేది తెలిపే మరో షాకింగ్ ఘటన జార్ఖండ్ లో తెరపైకి వచ్చింది. పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలో వైద్య నిర్లక్ష్యం కారణంగా దిగ్భ్రాంతికరమైన కేసు బయటపడింది! ఇందులో భాగంగా... చైబాసాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త మార్పిడి తర్వాత ఏడేళ్ల తలసేమియా రోగితో సహా కనీసం ఐదుగురు పిల్లలకు హెచ్.ఐ.వీ. పాజిటివ్ ఉన్నట్లు తెలిసింది.
అవును.. వైద్యం నిర్లక్ష్యం కారణంగా పాపం పుణ్యం తెలియని ఐదుగురు పిల్లలకు హెచ్.ఐ.వీ. పాజిటివ్ ఉన్నట్లు తేలిన ఘటన జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.. దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అంతటా ఆగ్రహాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. దీనితో రాంచీ నుండి ఉన్నత స్థాయి వైద్య బృందం తక్షణ దర్యాప్తు చేపట్టింది.
శుక్రవారం చైబాసా సదర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో తలసేమియా బాధిత బాలుడికి హెచ్.ఐ.వీ. సోకిన రక్తం ఎక్కించారని అతని కుటుంబం ఆరోపించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం బృందం తనిఖీ సమయంలో.. తలసేమియాతో బాధపడుతున్న మరో నలుగురు పిల్లలు హెచ్.ఐ.వీ. పాజిటివ్ గా ఉన్నట్లు తేలింది. దీనితో ప్రభావితమైన మైనర్ల మొత్తం సంఖ్య ఐదుకు చేరుకుంది.
ఈ విషయం వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ దినేష్ కుమార్... తలసేమియా రోగికి కలుషితమైన రక్తం ఎక్కించబడిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని.. దర్యాప్తు సమయంలో బ్లడ్ బ్యాంకులో కొన్ని వ్యత్యాసాలు బయటపడ్డాయని.. వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో... డాక్టర్ శిప్రా దాస్, డాక్టర్ పాశ్వాన్, డాక్టర్ భగత్, జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్, డాక్టర్ శివచరణ్, డాక్టర్ మిను కుమారిలతో కూడిన దర్యాప్తు బృందం బ్లడ్ బ్యాంక్ కేంద్రంతో పాటు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ) రెండింటినీ తనిఖీ చేసింది. ఈ సందర్భంగా... బాధిత పిల్లల కుటుంబాలతో కూడా ఈ బృందం మాట్లాడింది.
ఈ సందర్భంగా స్పందించిన జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కుమార్.. ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అన్నారు. అయితే, రక్త మార్పిడి ద్వారా మాత్రమే ఇన్ఫెక్షన్ వచ్చిందని నిర్ధారించడం తొందరపాటు అవుతుందని.. కలుషితమైన సూదులకు గురికావడం వంటి ఇతర కారణాల వల్ల కూడా హెచ్.ఐ.వీ. సంక్రమణ సంభవించవచ్చని పేర్కొన్నారు.
