Begin typing your search above and press return to search.

'ఈ విజయం నా తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం'.. రంజనా భావోద్వేగం!

అవును... కొంతమంది జీవితం పూలపై నడకలా సాగితే.. మరికొంతమంది జీవితం మాత్రం ముళ్లతో, రాళ్లు రప్పలతో నిండిన రోడ్లపై పరుగులా ఉంటుంది.

By:  Raja Ch   |   13 Jan 2026 6:00 PM IST
ఈ విజయం నా తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం.. రంజనా భావోద్వేగం!
X

మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయంటే.. ఆ మనిషి జీవితంలో మరింత రాటు దేలుతాడని అంటారు! అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతే.. మరికొంతమంది మాత్రం నికార్సుగా నిలబడి పోరాడతారు.. పోరాడి గెలుస్తారు.. నిలుస్తారు.. వాళ్లే ఎంతో మందికి ఆదర్శంగా మారతారు. అలాంటి ఓ అమ్మాయే జార్ఖాండ్ కు చెందిన రంజనా కుమారి. 9 ఏళ్ల ప్రాయంలోనే తండ్రిని పోగొట్టుకున్నా.. పేదరికంతో కొట్టుమిట్టాడినా.. పోరాడి నిలిచి గెలిచింది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపికైంది.

అవును... కొంతమంది జీవితం పూలపై నడకలా సాగితే.. మరికొంతమంది జీవితం మాత్రం ముళ్లతో, రాళ్లు రప్పలతో నిండిన రోడ్లపై పరుగులా ఉంటుంది. ఈ రెండో కేటగిరీకి చెందిన జీవితమే రంజనా కుమారిది. హజారీభాగ్ జిల్లాకు చెందిన ఈమె 9 ఏళ్ల వయసులో ఉండగా 2013 జనవరి 1 నూతన సంవత్సర వేడుకల వేళ హోటల్ కార్మికుడైన ఆమె తండ్రి మనోజ్ కుమార్ హత్యకు గురయ్యారు. దీంతో.. ఈమె జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది.

కుటుంబానికి ఏకైక ఆధారమైన తండ్రి చనిపోవడంతో ఫ్యామిలీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ సమయంలో రంజనా తల్లి నూతన్ దేవి గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. ముగ్గురు కుమార్తెలను చదివించాలని నిర్ణయించుకుని అంగన్వాడీ కార్యకర్తగా చేరింది. ఈ సమయంలో.. కుటుంబ పరిస్థితిని అర్థం చేస్తున్న రంజన.. ఓ పక్క చదువుకుంటూనే తన వంతు సహాయం చేయాలనుకుంది. ఇందులో భాగంగా హైస్కూల్ చదువుతూ సుమారు 40 మందికి ట్యూషన్ చెప్పింది.

ఆ విధంగా కుటుంబానికి ఆసరాగా ఉంటూ చరిత్రలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఈ క్రమంలో 2024లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో రంజనా సత్తా చాటింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు ఎంపికైంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్‌ లోని సిలిగురిలో ఏడాది పాటు కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని.. ఇటీవల జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ లో యూనిఫాం ధరించి తల్లికి కనిపించింది. దీంతో.. తల్లి కళ్లలో ఆనందబాష్పాలు రాలాయి!

ఈ సందర్భంగా స్పందించిన రంజనా... తాను మొదటిసారి ఈ యూనిఫాం ధరించినప్పుడు కళ్ల ముందు నాన్న ముఖమే కదిలింది.. ఈ విజయం నా తల్లి పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటూ భావోద్వేగంతో చెప్పింది. తన విజయం పేదరికంలో పెరుగుతున్న బాలికలకు అంకితం అని తెలిపింది. ప్రస్తుతం భారత్ – పాకిస్థాన్ సరిహద్దులోని జైసల్మేర్ సెక్టార్‌ లో తన మొదటి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోంది. రమజానా సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కదా!!