ముష్కర ముఠా కొత్త కుట్ర.. జైషే మహిళా బ్రిగేడ్!!
ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్ పూర్ లోని ఈ జైషే ప్రధాన కేంద్రంపై భారత్ బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే.
By: Tupaki Political Desk | 9 Oct 2025 7:00 PM ISTపహల్గాం దాడికి ప్రతీకారంగా మన సైనికులు జరిపిన దాడులతో పూర్తిగా దెబ్బతిన్న జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కొత్త కుట్రలకు తెరతీసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ‘ఆపరేషన్ సిందూర్’తో కకావికలమైన ఉగ్రవాదులు ఇప్పటికే తేరుకోలేకపోయారు. పలు ఉగ్రవాద కేంద్రాలపై మన దేశ వైమానిక దళం దాడులు చేయడంతో వందల మంది ఉగ్రవాదులు మరణించారు. ఇక ఈ నష్టం నుంచి బయటపడేందుకు ముష్కర ముఠాలు కొత్త ఎత్తుగడులు వేస్తున్నట్లు సమాచారం. భారత్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఉగ్రవాదుల భార్యలతో ప్రత్యేక మహిళా బ్రిగేడ్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోలుకోడానికి ప్రయత్నిస్తున్న మసూద్ అజహర్ మహిళా బ్రిగేడ్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయని అంటున్నారు. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి. ‘జమాతే ఉల్ మామినాత్’ పేరుతో ఈ స్పెషల్ బ్రిగేడును జైషే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం బహవల్పూర్లోని జైషే ప్రధాన కేంద్రంలో నియామకాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. ఈ కొత్త యూనిట్ కు మసూద్ సోదరి సాదియా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్ పూర్ లోని ఈ జైషే ప్రధాన కేంద్రంపై భారత్ బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో జైషే కేంద్రం దారుణంగా ధ్వంసమవడమే గాక, మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పది మంది మరణించారు. ఈ విషయాన్ని ఇటీవల జైషే కమాండర్ కూడా ధ్రువీకరించారు. మరణించిన వారిలో మసూద్ బావ, సాదియా భర్త యూసఫ్ అజార్ కూడా ఉన్నాడు.
ప్రధానంగా జైషే మహిళా బ్రిగేడులో ఆ సంస్థ కమాండర్ల భార్యలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరితోపాటు బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరీపూర్ వంటి ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐసిస్, బోకో హరామ్, హమాస్ వంటి ఉగ్ర ముఠాలు మహిళలను నియమించుకుని వారిని ఆత్మాహుతిదాడులకు ఉపయోగించున్న ఘటనలు నమోదయ్యాయి. ఇప్పుడు జైషే కూడా అదే పంథాను అనుసరించేందుకు సిద్ధమవుతోందని అంటున్నారు.
