ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం.. ట్రంప్ ఫొటోతో సహా 16 ఫైళ్లు మాయం చేశారే
మాయమైన ఫైళ్లలో అత్యంత సున్నితమైన అంశాలున్నాయని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఆయన భార్య మెలానియా, జెఫ్రీ ఎప్ స్టీన్, గిస్లెన్ మాక్స్ వెల్ కలిసి ఉన్న ఫొటోలు ఉన్నట్లు తెలుస్తోంది.
By: A.N.Kumar | 21 Dec 2025 12:51 PM ISTఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం కేసు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన కీలక పత్రాల్లో కొన్ని ఫైళ్లు అకస్మాత్తుగా మాయమవ్వడం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. ముఖ్యంగా ఈ మాయమైన ఫైళ్లతో డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ఫొటోలు ఉన్నాయనే వార్త ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
ఏమిటీ వివాదం ?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన జెఫ్రీ ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం కేసులో అమెరికా ప్రభుత్వం పారదర్శకత కోసం కొన్ని రహస్య పత్రాలను బహిరంగ పరుస్తోంది. శుక్రవారం న్యాయ శాఖ వెబ్ సైట్ లో ఈ పత్రాలను ఉంచగా.. కొన్ని గంటల్లోనే సుమారు 16 కీలక ఫైళ్లు అదృశ్యమయ్యాయి.
మాయమైన ఫైళ్లలో అత్యంత సున్నితమైన అంశాలున్నాయని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఆయన భార్య మెలానియా, జెఫ్రీ ఎప్ స్టీన్, గిస్లెన్ మాక్స్ వెల్ కలిసి ఉన్న ఫొటోలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి ఎఫ్.బీఐ సేకరించిన కీలక వాంగ్మూలాలు ఉన్నట్టు సమాచారం. న్యాయశాఖకు సంబంధించిన కొన్ని గోప్యమైన అంతర్గత సమాచారం దాచేసినట్టు సమాచారం. గతంలో విడుదల చేసిన జాబితాలో బిల్ క్లింటన్ , మైఖేల్ జాక్సన్ వంటి ప్రముఖుల పేర్లు/ఫొటోలు ఉన్నప్పటికీ ట్రంప్ ఫొటోలు ఉన్న ఫైళ్లు మాయమవ్వడం అనుమానాలు తావిస్తోంది.
లిస్టులో ఉన్న ప్రముఖులు వీరే..
తాజాగా విడుదలైన ఫొటోలలో కేవలం నేరగాళ్లే కాకుండా.. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు కనిపించడం విస్తుగొలుపుతోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రపంచ ప్రఖ్యాత భాషావేత్త నోవమ్ చోమ్స్కీ , ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు వూడీ అలెన్ లాంటి వారు ఉండడం చూసి అంతా షాక్ అవుతున్నారు. గతంలోనే వీరికి ఎప్ స్టీన్ తో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ తాజా చిత్రాలు ఆ బంధాన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఫొటోలతో పాటు కొన్ని కీలకమైన చాటింగ్ స్క్రీన్ షాట్ లను కూడా కమిటీ బయటపెట్టింది. అందులో ‘నేను ఇప్పుడే అమ్మాయిలను పంపుతున్నాను’ అనే అర్థం వచ్చే సందేశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఎప్ స్టీన్ నడిపిన అంతర్జాతీయ సెక్స్ ట్రాఫికింగ్ నెట్ వర్క్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తోంది. అంతేకాకుండా రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందిన మహిళల పాస్ పోర్టుల కాపీలు కూడా అక్కడ లభ్యమయ్యాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ మహిళల పేర్లను వివరాలను అధికారులు బ్లర్ చేశారు. తూర్పు యూరప్ దేశాల నుంచి యువతులను ప్రలోభ పెట్టి అమెరికాకు రప్పించి వారిని ప్రముఖుల కోసం వినిగించేవారని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.
రాజకీయ దుమారం
ఈ ఘటనపై డెమోక్రాట్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. హౌస్ ఓవర్ సైట్ కమిటీ సభ్యులు అటార్నీ జనరల్ పామ్ బోందీపై విమర్శలు గుప్పించారు. అమెరికా ప్రజలకు నిజాలు తెలియాలి. ప్రభుత్వం ఇంకా వేటిని కప్పిపుచ్చాలని చూస్తోంది అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఫైళ్లు సాంకేతిక కారణాల వల్ల అదృశ్యమయ్యాయా? లేక ఎవరినైనా రక్షించేందుకు ఉద్దేశపూర్వకంగా తొలగించారా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ప్రస్తుతానికి అమెరికా న్యాయశాఖ ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఒకవేళ ఇవి ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు తేలితే.. ఇది అమెరికా రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసే అవకాశం ఉంది. బాధితులకు న్యాయం జరగాలంటే పూర్తి పత్రాలను బహిర్గతం చేయాలని మానవ హక్కుల సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
