హెచ్-1బీ వీసాలపై జేడీ వాన్స్ ఆరోపణలు.. మైక్రోసాఫ్ట్ ఘాటు కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం.. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మధ్య హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియ అయిన పీఈఆర్ఎం (పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్) దరఖాస్తులపై చెలరేగిన తీవ్ర వివాదం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 9 Oct 2026 3:23 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం.. ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మధ్య హెచ్-1బీ వీసాలు, గ్రీన్‌కార్డ్ ప్రక్రియ అయిన పీఈఆర్ఎం (పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్) దరఖాస్తులపై చెలరేగిన తీవ్ర వివాదం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. స్థానిక అమెరికన్ ఉద్యోగులకు తగిన అవకాశాలు ఇవ్వకుండా తొలగిస్తూ వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్ సంస్థపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రత్యక్ష సంచలన ఆరోపణలు ఈ వివాదానికి ప్రధాన కారణమయ్యాయి. హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేయడంలో మైక్రోసాఫ్ట్ ముందంజలో ఉందంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
జేడీ వాన్స్ తన ఆరోపణల్లో మైక్రోసాఫ్ట్ గణాంకాలను ప్రస్తావిస్తూ గడిచిన ఏడాది సమయంలో కంపెనీ దాదాపు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించిందని పేర్కొన్నారు. తొలగించిన ప్రతీ స్థానిక ఉద్యోగికి బదులుగా ఒకటిన్నర మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ వీసాలు.. గ్రీన్‌కార్డుల ద్వారా వారికి ఎక్కువ అవకాశాలు కల్పించారని వాదనలు వినిపించారు. అంతేకాకుండా విదేశీ ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ కంపెనీలు తమ వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయని.. ఫలితంగా పీఈఆర్ఎం కార్యక్రమం ద్వారా శాశ్వతంగా నివసించే అవకాశాలను విదేశీయులకు కల్పిస్తూ స్థానిక అమెరికన్ల ఉపాధి హక్కులను దెబ్బతీస్తున్నారని వాన్స్ ఘాటుగా ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై మైక్రోసాఫ్ట్ యాజమాన్యం తక్షణమే స్పందించి తీవ్ర స్థాయిలో ఖండించింది. వాన్స్ సేకరించిన లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. తమ కంపెనీ సమర్పించిన హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో సుమారు 80 శాతం దరఖాస్తులు కొత్తగా విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకురావడానికి సంబంధించినవి కావు అని వెల్లడించింది. ఇవి ఇప్పటికే తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వీసాల పొడిగింపులు.. హోదా మార్పులకు సంబంధించినవేనని వివరించింది. మిగిలిన కొద్దిపాటి దరఖాస్తులు కూడా ఇప్పటికే అమెరికాలోనే ఉంటూ ఇతర కంపెనీల నుంచి మైక్రోసాఫ్ట్‌కు మారిన వారివేనని.. ఇది కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్యలో కేవలం ఒక శాతానికి మాత్రమే సమానమని తెలిపింది. అలాగే స్థానిక ఉద్యోగులతో సమానంగా అత్యంత పోటీతత్వంతో కూడిన గరిష్ట వేతనాలనే హెచ్-1బీ ఉద్యోగులకు కూడా అందిస్తున్నామని స్పష్టం చేసింది.
ఈ వివాదం వేడెక్కుతున్న తరుణంలోనే అమెరికా కార్మిక శాఖ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. వాషింగ్టన్‌లోని రెడ్‌మండ్ కేంద్రంగా పనిచేస్తున్న మైక్రోసాఫ్ట్‌తో పాటు అడోబ్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో వంటి మరో ఏడు ప్రముఖ ఐటీ కంపెనీల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కార్మిక శాఖ అధికారి కీత్ సోండర్లింగ్ వెల్లడించిన ఈ నిర్ణయం ప్రకారం ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రాసెసింగ్‌ను కూడా తాత్కాలికంగా ఆపివేస్తున్నారు. ఉద్యోగానికి సరిపడా అర్హత ఉన్న అమెరికన్ ఉద్యోగులు దొరకనప్పుడు మాత్రమే విదేశీయులకు పెర్మ్ ద్వారా అవకాశం కల్పించాలనే నిబంధనను ఈ సంస్థలు సరిగ్గా పాటించడం లేదన్న కారణంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిణామం అమెరికాలో దశాబ్దాలుగా చట్టబద్ధంగా పనిచేస్తూ గ్రీన్‌కార్డ్ కోసం సుదీర్ఘ నిరీక్షణలో ఉన్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు.. విదేశీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ప్రభుత్వ చర్యలపై డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి ప్రమీలా జయపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి చట్టబద్ధంగా అమెరికాలో నివసించే మార్గాలను మూసివేయడం పక్షపాత పూరిత చర్య అని.. ఇది దుర్వినియోగాన్ని అరికట్టడం కంటే చట్టబద్ధ వలసదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఆమె విమర్శించారు. సెనేటర్ ప్యాటీ ముర్రే కూడా కార్మిక శాఖ నిర్ణయాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఎంతో ఆసక్తికరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. మైక్రోసాఫ్ట్‌పై ఉపాధ్యక్షుడు వాన్స్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ , సీఈఓ సత్య నాదెళ్లకు "నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్" ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వయంగా అందజేశారు. ఒకప్పుడు హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చి ప్రపంచ ఐటీ రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగిన నాదెళ్ల సేవలను ట్రంప్ ఈ సందర్భంగా కొనియాడారు. సాంకేతిక పురోగతి, అమెరికా ఆర్థిక ప్రగతికి నాదెళ్ల అందించిన సహకారం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ పురస్కారం అందుకున్న అనంతరం నాదెళ్ల సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలిపినప్పటికీ వాన్స్ చేసిన విమర్శలపై నేరుగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనం పాటించారు.
ప్రస్తుత పరిణామాలు స్థానిక అమెరికన్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకునే ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలకు.. అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యంపై ఆధారపడే టెక్ కంపెనీల అవసరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి. ప్రత్యేకించి భారతీయ ఐటీ ఉద్యోగులకు ఈ నిర్ణయాలు పెద్ద సవాలుగా మారాయి. ఈ పెర్మ్ దరఖాస్తుల నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుంది. దీనిపై బాధితులు లేదా కంపెనీలు కోర్టులను ఆశ్రయిస్తాయా రాబోయే రోజుల్లో హెచ్-1బీ నిబంధనలు ఇంకా ఎంత కఠినతరం కానున్నాయనే అంశాలపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
