Begin typing your search above and press return to search.

అమెరికా ఉపాధ్యక్షుడి మేల్ ఇగో.. అదే మాట అతడి భార్య అని ఉంటే?

భారతసంతతికి చెందిన ఉషాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రేమించి పెళ్లాడిన వైనం తెలిసిందే.

By:  Garuda Media   |   1 Nov 2025 10:15 AM IST
అమెరికా ఉపాధ్యక్షుడి మేల్ ఇగో.. అదే మాట అతడి భార్య అని ఉంటే?
X

అమెరికా ఉపాధ్యక్షుడైనా.. అంబాజీపేట మగాడైనా ఒక్కటేలా ఆలోచిస్తారా? ఇంట్లో ఉన్న భార్యకు మనోభావాలు ఉంటాయని.. వాటిని ఇబ్బంది పెట్టేలా.. ఆమె మనసును నొప్పించకుండా ఉండాలని భావించరా? విషయాల్నితమ కోణంలో చూడటమే తప్పించి.. తన జీవిత భాగస్వామి వైపు నుంచి చూడరా? అన్నదిప్పుడు చర్చగా మారింది.

భారతసంతతికి చెందిన ఉషాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రేమించి పెళ్లాడిన వైనం తెలిసిందే. ఇప్పుడంటే అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు అయ్యాడు కానీ.. పెళ్లి వేళకు అందరిలానే అతను ఒక మామూలు వ్యక్తే. ప్రేమించి చేసుకున్న పెళ్లి అయిన నేపథ్యంలో మిగిలిన జంటల మాదిరే.. మతాలు.. వాటి విషయంలో తామెలా వ్యవహరించాలన్న దానిపై చర్చ జరగకుండా ఉండి ఉండదు.

ఒకవేళ మతం మీద స్థిరమైన అభిప్రాయం ఉండి.. కచ్ఛితంగా ఆమె మతం మారితేనే పెళ్లి చేసుకోవాలన్నట్లుగా జేడీ వాన్స్ కు ఫీలింగ్ ఉండి ఉంటే.. ఉషా అందుకు అంగీకరించి ఉండి ఉంటే.. ఈ రోజు ఈ చర్చ ఉండేది కాదు. పెళ్లై ఇంతకాలం అయినప్పటికి ఆమె హిందువుగా.. జేడీ వాన్స్ క్రిస్టియన్ గా ఉండి ఉన్నారంటే.. మత విశ్వాసాల విషయంలో ఇరువురు ఒకరిని ఒకరు గౌరవించుకోవాలన్న ఆలోచనతోనే ఉండి ఉంటారు.

అలాంటప్పుడు తాజాగా జేడీ వాన్స్ నోటి నుంచి వచ్చిన మాటల్ని చూసినప్పుడు.. సమాజంలో మాత్రమే కాదు కుటుంబంలోనూ పురుషాధిక్యత ఎంతలా ఉంటుందన్న ఇట్టే అర్థమవుతుంది. అమెరికా లాంటి దేశంలో అత్యంత పవర్ ఫుల్ స్థానం తర్వాతి స్థానంలో ఉండి కూడా.. తన మేల్ ఇగోను ప్రదర్శించటానికి ఆయన వెనుకాడకపోవటం ఇట్టే కనిపిస్తుంది. తన భార్య ఉషా వాన్స్ ఏదో ఒక రోజు మతం మారుతుందని ఆశిస్తున్నట్లుగా పేర్కొనటం పెద్ద చర్చకు తెర తీసిన విషయం తెలిసిందే. వాన్స్ తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఎంత ప్రజాప్రతినిధి అయితే మాత్రం.. తన భార్యకు సంబంధించిన ఒక అంశం మీద మాట్లాడే వేళలో.. ఆచితూచి అన్నట్లుగా స్పందించాల్సి ఉంది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే.. ముందుగా ఆమెతో ఆ విషయం మీద చర్చించి ఉండాల్సింది. నిజంగానే.. ఆమె మతం మారే ఆలోచనలో ఉండి ఉంటే.. ఆ అంశాన్ని ప్రస్తావించటంలో తప్పు లేదు. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయం అతడి మాటలే స్పష్టం చేస్తున్నాయి.

అయినప్పటికి తాను ఆచరించే మతంలోకి తన భార్య ఏదో ఒక రోజు వస్తుందన్న విశ్వాసం తనకుందన్న మాటలు.. అతడి పురషాంహకారాన్ని తెలియజేసేలా ఉన్నాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అదే సమయంలో ఆమె తన మత విశ్వాసం విషయంలో కచ్ఛితంగా..బలంగా ఉందన్న విషయం తాజాగా జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యను చూస్తే అర్థమవుతుంది.

‘‘నా మతాంతర వివాహం గురించి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రజాప్రతినిది కావటంతో వీటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి ఉండటం సహజం. వీటిపై మాట్లాడకుండా తప్పించుకోలేను. నా మత విశ్వాసాలను గౌరవిస్తాను.నా భార్య కూడా చాలా సంవత్సరాల క్రితమే దీనికి అంగీకరించింది.ఆమె క్రిస్టియన్ కాదు. మతం మారే ఆలోచన కూడా లేదు. ఇతర మతాంతర వివాహాలు.. బంధాల్లో మాదిరే.. ఏదో ఒక రోజు నా కోణంలో ఆలోచిస్తుందని ఆశిస్తున్నా. ఏదేమైనా ఆమెను ప్రేమిస్తూ.. ఆమెకు అండగా ఉంటూనే ఉంటా. ఆమె నా భార్య అయినందున అన్ని విషయాలపై ఆమెతో మాట్లాడతా’’ అని చెప్పిన వైనం చూస్తే.. ఒక్క విషయం అర్థమవుతుంది.

భర్త మత విశ్వాసాల్ని భార్య ఫాలో అవుతుందన్న ఆశను జేడీ వాన్స్ వ్యక్తం చేస్తే.. అదే వ్యక్తి తన భార్య మత విశ్వాసాల్ని అతడు ఎందుకు ఫాలో కాకూడదు? అన్నది ప్రశ్న. ఇక్కడే... జేడీ వాన్స్ లోని మేల్ ఇగో బయటకు వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేర్వేరు మత విశ్వాసాలున్న ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒకటైనప్పుడు.. వారి మధ్య కానీ.. నలుగురి మధ్యన కానీ వారి మత విశ్వాసాల మీద వచ్చే ప్రశ్నలకు.. భాగస్వామి మనోభావాల్ని నొప్పించకుండా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. ఈ విషయంలో జేడీ వాన్స్ వ్యవహరించిన తీరు ప్రశ్నించేలా ఉందని మాత్రం చెప్పక తప్పదు.