జేడీ వాన్స్ రెండో భార్య మునీర్.. మీమ్స్ సునామీ.. ఏకిపారేస్తున్నారు..
సాధారణంగా రాజకీయ నాయకులు దౌత్యపరమైన పొగడ్తలు కురిపించడం చూస్తుంటాం. కానీ వాన్స్ ఏకంగా తన అర్ధాంగితో పోలుస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు అస్సలు వదిలిపెట్టడం లేదు.
By: A.N.Kumar | 22 Jun 2026 9:57 AM ISTఅంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కష్టం కానీ మన సోషల్ మీడియా వీరుల చేతికి ఒకసారి చిక్కితే మాత్రం నవ్వుల పండగే.. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ఒక 'అనన్య సామాన్యమైన' వ్యాఖ్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది. తన భార్య ఉష కంటే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అంటూ జేడీ వాన్స్ సెలవివ్వడమే ఆలస్యం... ఇటు వాషింగ్టన్ నుండి అటు ఇస్లామాబాద్ వరకు మీమ్స్ సునామీ మొదలైంది.
సోషల్ మీడియాలో 'రెండో భార్య' ట్రెండింగ్
సాధారణంగా రాజకీయ నాయకులు దౌత్యపరమైన పొగడ్తలు కురిపించడం చూస్తుంటాం. కానీ వాన్స్ ఏకంగా తన అర్ధాంగితో పోలుస్తూ మాట్లాడటాన్ని నెటిజన్లు అస్సలు వదిలిపెట్టడం లేదు. ఏఐ సాయంతో సృష్టించిన ఫొటోలు ఇప్పుడు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను షేక్ చేస్తున్నాయి.
వైరల్ మీమ్స్ హైలైట్స్
జేడీ వాన్స్‌ను సాంప్రదాయ పాకిస్థానీ వరుడులా ముస్తాబు చేసి, అసిమ్ మునీర్ పక్కన కూర్చోబెట్టిన ఎడిటింగ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
"జేడీ వాన్స్ రెండో భార్య అసిమ్ మునీర్ " అంటూ నెటిజన్లు పెడుతున్న క్యాప్షన్లు హల్ చల్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై మునీర్ తెగ మురిసిపోతున్నట్లుగా ఉన్న పేరడీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఈ రేంజ్ క్రియేటివిటీ చూసి సామాన్య జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటుంటే.. వైట్ హౌస్ దౌత్యవేత్తలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు.
అమెరికా స్టైల్.. "అవసరానికి కాకా... ఆ తర్వాత కాలితో తన్ను!"
ఇక ఈ వ్యవహారంపై కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు, నెటిజన్లు అమెరికా విదేశాంగ విధానంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. అమెరికాకు ఇదో అలవాటైన విద్యేనని కొట్టిపారేస్తున్నారు. "పని ఉంటే చాలు... అవతలి వాడు ఎంతటి వాడైనా సరే 'నా ప్రాణ స్నేహితుడు, నా భార్య కంటే ఎక్కువ' అంటూ భజన చేయడం, అవసరం తీరిపోయాక 'నువ్వెవరో నాకు తెలియదు' అని కాలితో తన్నడం అమెరికా మార్క్ రాజకీయం" అంటూ నెటిజన్లు ఘాటుగా.. వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. పాకిస్థాన్ కూడా ఈ పొగడ్తలకు పొంగిపోకుండా, వెనుక ఏదో పెద్ద స్కెచ్చే ఉంటుందని జాగ్రత్త పడితే మంచిదనే ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు.
హాస్యం వెనుక అంతర్జాతీయ రాజకీయం
అయితే ఇవన్నీ సోషల్ మీడియా బాబుల కడుపుబ్బ నవ్వించే కల్పిత క్రియేషన్స్ మాత్రమేనని, దీనికి అధికారిక దౌత్య సంబంధాలకు ఎలాంటి లింకు లేదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయ నేతలు అంతర్జాతీయ వేదికలపై చేసే అతివ్యాఖ్యలు ఇలాంటి ట్రోలింగ్‌కు దారితీయడం కొత్తేమీ కాదు.
ప్రస్తుతానికి జేడీ వాన్స్, అసిమ్ మునీర్ జోడీ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. హాస్యంగా మొదలైన ఈ మీమ్స్ ట్రెండ్... ఇప్పుడు అమెరికా, పాక్ రక్షణ, విదేశాంగ విధానాలపై సీరియస్ చర్చకు కూడా దారితీయడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ఇద్దరు నేతలు మాత్రం నెటిజన్లకు వారం రోజులకు సరిపడా వినోదాన్ని పంచారనడంలో ఎలాంటి సందేహం లేదు.
